Friday, January 29, 2010

వాఆఆఆవ్ చాలాబాగుంది







నీరో చక్రవర్తి గురుంచి మనమంతా విన్నాం కదా, రోం నగరం తగలబడుతుంటే చూస్తు ఫిడేల్ వాయించుకుంటు కూర్చున్నాడని మరి మన నాయకులు ఎమైనా తీసిపోయారా, అంతకన్న గొప్పవాళ్ళు ఉన్నారండి మన దగ్గర,
ఒక వైపు తెలంగాణా ఇవ్వమని, వద్దని రాష్ట్రమంతా రావణ కాస్టం లా రగిలిపోతుంది, 2 సార్లు చీఫ్ మినిస్టెర్ గా చేసిన వ్యక్తి తన వాళ్ళని ఎగదోసి ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు, తను మాత్రం నోరు విప్పడు, వచ్చినా నా మంచికే రాకపోయిన నా మంచికే కొట్టుకోనివ్వు చావనివ్వు, అంటు తమషా చూస్తు కూర్చున్నాడు, ఇంత రాజకీయం ఎవరికైనా తెలుసా, టీ. ర్ .స్ .వాళ్ళకన్నా మద్యలో కూర్చుని తెలుగుదెశం నాయకులు చేస్తున్న గొడవే ఎక్కువగా వుంది, వీళ్ళ కత్తి కి రెండువైపుల పదునే,ప్రతి విషయాన్ని తమకి సానుకూలంగా మార్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.


ఇదంతా కూడా వాళ్ళ నాయకుడు వెనక వుండి నడిపిస్తున్న తంత్రం లో భాగమే అన్నది జగమెరిగిన సత్యం, ఇంతకి ఈయన ఇంట్లో కూర్చుని ఏమి చేస్తున్నాడని అందరు తలబద్ధలు కొట్టుకుంటున్నారు, లాభం లేనిదే శెట్టీ వరదన పొడనీ, ఇంట్లొ వున్న చంద్రబాబు ఫామిలి రాజకీయాలు చక్కపెడ్తున్నాడని ఇప్పుడె తెలిసింది, ఇన్ని రోజులు పక్కన పెట్టిన జూనియర్ ఎన్. టి. ర్ రాజకీయాలో పనికి వస్తాడు అతని చరిష్మాని వినియోగించుకోవచ్చు అన్న దశలో నెత్తిమీదకెత్తుకుని, తెలుగు దేశం కి ప్రచారం చేయించుకున్నాడు, అప్పుడే జరిగిన ప్రమాదం లో అతను మంచం మీద వుండినా అక్కడి నుండీ కూడ టి. వి. లో ప్రచారం చేయించిన ఘనుడు.ఎన్.టి.ర్ తరువాతి హీరో అతని వారసుడు ఐన బాలక్రిష్ణ ని ఏకంగా వియ్యంకుడిని చేసుకుని నోరెత్తకుండా చేసాడు.


సినెమా ప్రపంచంలో ఎన్.టి.ర్ ఎదుగుతున్న క్రమం చూసాక ఇంక అతన్ని బయటకి పోనివ్వడం భావ్యం కాదని తెలుసుకుని, తన మేనకోడలి కూతురు 17 సంవత్సరాల పసిదానితో పెళ్ళి నిశ్చయం చేసాడు, జూనియర్ ఎన్.టి.ర్ కూడా దీని కోసమే ఎదురు చూస్తున్నాడు కనుక వాళ్ళ అమ్మకి గౌరవం దక్కించడానికి ఫామిలి లో కలిసి పోవాడానికి దీనికి మించిన అవకాశం దొరకదు కనుక ఒప్పుకుని వుంటాడు.


మంచి తరుణం మించిపోనీకు అంటు చంద్ర బాబు రాజనీతికి చిక్కుకున్న జూనియర్ కి వాళ్ళ తాతకి జరిగిన వెన్నుపొటు కాకుండా మంచి జరగాలని ఆశిద్దాం.

వాఆఆఆవ్ చాలాబాగుంది నారా వారి పెళ్లి సినిమా కదూ.

భారతి

Thursday, January 28, 2010

పరికిణి




తనికెళ్ళ భరణి మంచి రచయిత అని మనందరికి తెలుసు ఆయన రాసిన "పరికిణి" కవితల సంపుటి చదివారా మీరు? చిన్న చిన్న మాటల తోనే ఇంత అందంగా కవిత చెప్పొచ్చా అని అద్బుతంగా అనిపించింది. కవితలో సొగసు మాత్రమె కాదు పదాలతో పదనిసలు ఆయన సొంతం. మనని ప్రతి లైన్ సొంతం చేసెసుకుంటుంది. తెలుగు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అమ్మాయికి 11 ఏళ్ళ వయసు రాగానే పరికిణి ఓణి కట్టిస్తారు, ఎందుకంటే అమ్మాయికి అందాన్ని ఇచ్చేది పరికిణి నే కాబట్టి అలాంటి పరికిణి మీద భరణి చెప్పిన ,
పరికిణి కవిత మీకోసం....

దండెం మీద
ఇంద్రధనస్సుని పిండి ఆరేసినట్టుంది!
కొడిపెట్టంటి వయస్సుని
కప్పెట్టిన బుట్టల్లే ఉంటుంది!

పదుచుపాము ఒంటి మీద
పంచరంగుల కుబుసంలా ఉంటుంది!
షాక్ కొట్టే ఎలక్ట్రిక్ వైర్ మీద
వేసిన కవరింగులా ఉంటుంది!

కలల పడవలకు
కట్టినతెరచాపలాగా
ఐస్ ప్రూట్ మీద ఉండే
ఉల్లిపొర కాగితంలాగా

కొత్త ఆవకాయ జాడీమీద
కట్టిన వాసనలాగ
పిందెలకి దిస్టితగలకుండ
కట్టిన గుడ్డలాగ

మాదుర్యానంతా

దాచుకున్నతేనెపట్టులాగ
సరుకులన్ని వున్న తెరవని
కిరాణ కొట్టులాగ
శృంగార రసంలో నానేసి నేసిన
అపారదర్శకపు అద్భుత దేవతా వస్త్రం -పరికిణి!

డాబా మీద నాలుగు చెరగులూ
పరిచి కుర్రకారు గుండెల్ని"పిండి" వడియాలు పెట్టేసిన జాణ - ఓణి!

ఓణి- పరికిణీ తెలుగు కన్నెపిల్లకు అర్ధాంతన్యాసలంకారాలు

పంజాబి డ్రెస్సులొచ్చి పరికిణీల్ని మాయం చేశాయన్న దుగ్ద కొద్ది రాసానని చెప్పారు భరణి మీకు నచ్చితే ఆయన కవితలు ఇంకా వున్నాయి నా దగ్గర ఏమంటారు?

భారతి

Tuesday, January 26, 2010

హసితం మధురం

నవ్వు నాలుగు విధాల చేటు ' అన్నారు కొందరు. 'నవ్వుతూ బ్రతకాలిరా ' అన్నారు కొందరు. 'నవ్వు నవ్వించు' అన్నారు కొందరు. ఎంతైనా హసితం మధురం. నాలుగు విధాల చేటు అనుకోకుండా, నవ్వుతూ బ్రతకటమే మంచిది అని నా అభిప్రాయం. ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని అడిగితే 'అధరం మధురం, హసితం మధురం, మధురాదిపతియే అఖిలం మధురం' అంటూ మధురంగా పాడేస్తుంది. నిజంగానే పరమాతం హసితం దేనికి సాటి రాదేమో.
పరంలో పరమాత్మ హసితం మధురమైతే, ఇహం లో, చిట్టి పాపాయిల బోసినవ్వుల తరువాతే ఎవరి నవ్వు గురించైనా మాట్లాడుకోవాలి.
పిల్లలు కాస్త పెద్దయ్యాక వారికి బాగా పరిచయమైన మధురమైన హసితం, బోసినవ్వుల గాంధీ దే కదా?
మా సీగానపెసూనాంబ ఈ మధ్య మనసారా నవ్వటం మానేసి, మూతి బిగించేసి నవ్వటం మొదలు పెట్టింది. అదేంటి అంటే, అనసారా నవ్వుకునేంత సంఘటనలు, వ్యక్తులు తనకి ఎదురవటం లేదన్నది తన ఉవాచ. ఇక నేను సంఘటనలు, మనుషులు ఎదురైనా అవకపోయినా, తెలుగు నటి సుహాసినిలా బలవంతంగా నవ్వేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో, మధురమైన హసితం గురించి చెప్పుకోవాలంటే, స్వర్గీయ వై.స్.ర్ దే చెప్పుకోవాలి. ఎన్ని నేరాలు, ఘోరాలు చేసినా, చెరగని దరహాసం ఆయన సొంతం. ఆయన కుమారుడు నవ్వితే మాత్రం ఎంతో కుతంత్రంగా ఉంటుంది. అధ్యాత్మిక గురువుల హసితం గురించి చెప్పాలంటే, ఓషో, రజనీష్ ల హసితాన్ని ఊహించుకోటానికి నేను కొంచెం కూడా సిద్దంగా లేను. చిన్న జీయర్ గారి హసితం పర్వాలేదనిపిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి హసితం నాకు మాత్రం మధురంగా అనిపిస్తుంది. ఆయన ప్రసంగాలెప్పుడు చిరునవ్వు చిందిస్తూనే చేస్తారు. ఇన్ని చెప్పాక, మొనాలిసా హసితం చెప్పకపోతే బాగోదు. మొనాలిసా గురించి ఎంత చదివినా, ఆ చిత్రంలోని అర్థం, ఆ నవ్వులోని అందం నాకు బోధపడవు. అందుకే నో కామెంట్స్.
నాకు బాగా నచ్చిన కొన్ని నవ్వు మొహాలు.
చివరిగా ప్రపంచం అంతటిని తన నవ్వు మొహంతో సదా పలకరించే ఒకే ఒక నవ్వు మొహం. కార్పోరేట్ రంగంలో, వ్యక్తిగత సంభాషణా, సమాచారాలలో, ఎంత చెత్త అయినా మాట్లాడి లేదా ఎంత చెత్త అయిన రాసేసి, చివరిగా దీన్ని పెట్టేస్తే అంతా కుశలమే.
చిరునవ్వే చిందించని వాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉంటారు. వాళ్ళకి, ఇంకా సంకుచితంగా నవ్వే వాళ్ళకి నా సంతాపం. ఎన్ని ఒత్తిడులు ఉన్నా మొహం మీద చిరునవ్వుని చెరగనీయకపోవటం నిజంగా ఒక కళ. అలాంటి వ్యక్తుల గురించి, వారి హసితం గురించి ఈ బ్లాగు ద్వారా నాతో పంచుకుంటే చాలా ఆనందం.
--విజయ

Saturday, January 16, 2010

కాలమా మారిపోకే మరీ అంతలా

ఒక చల్లని సాయంత్రం, ఎస్.పి.బాలుగారు పాడిన, 'కాలమిలా ఆగిపోని ' పాట వింటూవుంటే, నిజంగా ఆ నిముషానికి కాలం అలా ఆగిపోతే బాగుండు అనిపించింది. ఆ తరువాత నా దృష్టి అంతా కాలం మీదకి మళ్ళి పోయింది. ఎవరెంతగా కోరుకున్నా కాలం వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతునే ఉంటుందిగా. అదేంటో, ఈ మధ్య 'అవతార్ ' సినిమాలోని నీలి కోతులని చూసాక. బాబోయ్ కాలం అంత దూరం వెళ్ళకూడదు అనుకున్నాను. నిజం చెప్పొద్దూ, గ్రాఫిక్స్ మాట దేవుడెరుగు, ఆ సినిమాలోని, పాండోరా ప్రదేశం, ఆ నీలి కోతులు, దాన్ని కూడా జయించాలన్న మనిషి తపన ఇవేవి నాకు నచ్చలేదు.

నా స్నేహితురాలు అంటూ ఉంటుంది. కార్లు నడిపే రోజులు పోయి, వ్యక్తిగత పారాచూట్లు వచ్చేస్తాయి, ఆఫీసుకెళ్ళాలన్నా, బజారుకెళ్ళాలన్నా, రెక్కలు అతికించుకుని ఆకశ మార్గాన వేళ్ళే రోజు తొందర్లోనే వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు నేను ఆకాశంలో హెలో ఎక్కడికెళ్తున్నావ్ అని పలకరించుకుంటాం అని. ఈ మార్పు మాత్రం నాకెందుకో బాగానే నచ్చేసింది. తన ఆలోచన అలా ఉంటే, నేనెమో, భూ వనరులన్ని అయిపోయి, మళ్ళీ ఎడ్ల బండి ఎక్కి, 'బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి ' అని పాడుకుంటూ వేళ్ళాల్సి వస్తుందేమో అని అనుకుంటాను.

కాలాము సాగిపోయేదే, జీవితం సాగిపోయేదే, అయితే కాలం, గతాన్ని తవ్వుకోదు, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోదు. అవి రేండూ చేస్తూ, సాగే జీవనానికి ఆనకట్టలు వేసుకునేది మనమే కదా? అయినా, అవి రెండు లేకపోతే మనిషి మనుగడే లేదేమో. సో, గతాన్ని తవ్వుకోవాల్సిందే, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాల్సిందే. ఐతే, గతం మనల్ని తినేసేలా, భవిష్యత్తు మనల్ని భయపెట్టేదిగా ఉండకుండ ఉంటే చాలునేమో.

--విజయ


Wednesday, January 13, 2010

తెలుగు దేశమంతా సంక్రాంతి


సంక్రాంతి అనగానే భోగిపళ్ళు, ముగ్గులు, అరిసెలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఇంత ఆనందాన్ని కళని ఇంకే పండగ మోసుకొస్తుంది చెప్పండి.
అందమే ఆనందం అన్నారు కదా, ముగ్గులతో మామిడి తోరనాలతో అందంగా అలంకరించుకుని రావమ్మ మహాలక్ష్మి రావమ్మా అనే పాటని పెడ్తే ఘంటసాల గొంతులో మాధుర్యానికి మహాలక్ష్మి పొంగిపోయి అన్నా మనింటికొచ్చేయదా చెప్పండి.
అందుకే సంక్రాంతి అంటే అంత ఆనందం అందరికి, మగవాళ్ళని ఎవరిని కదిలించినా పెళ్ళైన కొత్తలొ సంక్రాంతి కి మా అత్తగారి ఊరిలో జరిగిన నాకు జరిగిన వైభోగం తిన్న పిండి వంటలు అంటూ మట్లాడని వాళ్ళు వుంటారా, అంటే సంక్రాంతి అతని జీవితం లోనే మరపురాని తీపి గుర్తుల్ని జీవితాంతం గుర్తుంచుకునేలా మిగిలిస్తుంది.
తరువాత జీవన గమనంలో ఎన్ని పండగలు వచ్చినా కొత్త అల్లుడికి మొదటి సంక్రాంతి మిగిల్చే తీపి అరిసెల గుర్తులే వేరు.
పట్టు పావడాల అమ్మాయిలు గొబ్బిళ్ళు ముగ్గులు పెట్టి చిలకపచ్చ పావడా నాది చూడూ అంటే, ఎరుపు రంగు ఓణి నాది చూడు అంటూ, వయ్యరాలు పోయె ఆ లంగా ఓణిల లోని సింగారాలని చూడడానికిఉన్న కళ్ళు సరిపోతాయా, అదే తెలుగు తనం లోని కమ్మదనం, తెలుగు ఆడపిల్ల ఇప్పుడంటే చుడిదార్ల లోకి దిగారు, కాని పండగ నాటి అమ్మాయిలు పావడాల్తో కనువిందు చేస్తారు.
ఏ దేశం లో ఊన్న,ఒక్క సారి మా ఊరు పోయిరావాలి,పంట చేలతో మాటాడి రావాలి,అమ్మ చేతి పిండివంటలు తినేసి రావాలి,అనుకోని తెలుగు వాడు వుంటాడా.
అదే తెలుగు సంక్రాంతి లో వున్న అందం అన్ని పండగలు ఆనందాన్ని పంచుతాయి, అదేంటో సంక్రాంతి ఆత్మీయతని పంచుతుంది అనిపిస్తుంది నాకు.
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.మనది తెలుగు జాతి, మనది తెలుగు సంక్రాంతి, సంక్రాంతి కి ప్రాంతీయ భెధాలు లెవు ఇంటింటా వస్తుంది, పసి పాపల బొసినవ్వులా ఎవరిని చూసినా పలకరిస్తుంది. మన సంస్క్రుతికి లేని తేడాలు మనకెందుకు చెప్పండి. అందరం కలిసి చేసుకుందాం.కలిసి బ్రతుకుదాం.
భారతి

Tuesday, January 5, 2010

ఓ తూరుపు కిరణం - ఓ వెన్నెల కెరటం


ప్రియురాలి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆకలి, దాహం ఉండవని కవులంటారు. కొంతవరకు అది నిజమేనేమొ. కాని ఆ ప్రియురాలు కాస్తా భార్య అయిపోగానే, మగవాడికి ముందు గుర్తు వచ్చేవి ఆకలి దప్పులే. వాటిని తీర్చుకోటానికి, రేయింబవళ్ళు కష్టపడటం మొదలెడతాడు. కుటుంబాన్ని నడిపిస్తూ లేక మోస్తూ, ఆడవారు యంత్రాల్లా తయారవుతారు. కష్ట సుఖాలు, కలిమి లేములు, వెలుగు నీడలు, ఆనందాతిశయాలు, ముక్కు చీదుతూనో, పకపక నవ్వేస్తూనో, మౌనంగా భరిస్తూనో గడిపేస్తారు. ఇది మనిషి వ్యక్తిగతం. సామాజికంగాచెప్పాలంటే, విద్య, పోటి, పోరాటం, ఆస్తి, అంతస్తు, అస్తిత్వం, అహం, ఆరాటం, కీర్తి, ప్రతిష్ట, గెలుపు, ఓటములు ఇంకా ఎన్నో. కాస్త అటు ఇటుగా, భావ సారూప్యాలతో, భాషా భేధాలతో, మోడ్రన్ గానో, మోటుగానో ఒక సగటు జీవితం, సగటు జీవితం ఏమిటి, ఏ మనిషి జీవితం అయినా దీనికి అతీతంగా సాగదని నా ప్రగాఢ విశ్వాసం.

సరే ఈ విశ్వాసానికి, ఈ టైటిల్ కి, ఈ రాతకి పొంతన ఎక్కడ అంటారా? ప్రియురాలి కళ్ళల్లోకి చూడటం గురించి చెప్తే, ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ప్రియురాలి కళ్ళల్లోకి చూస్తే బ్రతుకు సమరం మొదలవటమే కాక మళ్ళీ ఆ కళ్ళల్లోకి చూసే తీరికే దొరకదు. అలా చూడటంలో కష్ట నష్టాల గురించి మనం ఇప్పుడు మాట్లడుకోబోవటం లేదు. అలా చూడటం తో మొదలయ్యే బ్రతుకు సమరం గురించి, అలా రోజు చూడటంలో వున్న కష్టం గురించి. అదే తూరుపు నుంచి వచ్చే నులి వెచ్చని కిరణం, ప్రతి రోజు చూసినా ఎంతో అహ్లాదాన్ని కొత్తదనాన్ని ఇస్తుంది. అలాగే ఒక వెన్నెల కెరటం ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చి మనసుని మాయ చేస్తుంది. అదే మనిషికి, ప్రకృతికి ఉన్న తేడా. మనిషి కూడ ప్రకృతిలో భాగమే కదా అన్న వాదన తెచ్చినా, ప్రకృతి వైపరీత్యాల ప్రస్తావన తెచ్చినా ఇక్కడ నేను చెప్పాల్సింది వెనక్కి పోతుంది.

రాగ ద్వేషాలని, ఈర్శాసూయలని, చిన్నా పెద్ద తేడాలని, ధనిక పేద అంతరాలని, ఙాని అఙాని బేధాలని, కుల మత భేషజాలని పక్కకి నెట్టి ఆ ఉదయభానుని కెరటం పై మనసారా ద్రుష్టిని సారిస్తే భయాందోళనలు, చిరాకులు అంతగా కలగవని అనిపిస్తుంది, కలిగినా ఎక్కువ సేపు నిలవవని, మరుసటి రోజు దర్శనంతో మాయమై పోతుందని నా అభిప్రాయం. 'ఆదిత్య హృదయం' నాకు పూర్తిగా అర్థం కాదు కాని, అందులో ఎంతో విశేషముంది అని మాత్రం ఆ సూర్య భగవానుడిని చూడగానే అనిపిస్తుంది. ఆ దర్శనానికి ఎంతటి శక్తి ఉంది అంటే, పైన చెప్పిన తేడాలన్ని త్రుణీకరం అనిపిస్తాయి. ఎవరిని నొప్పించాలని అనిపించదు. ఎవరైనా మనలని నొప్పించినా వారి స్వభావం అంతేలే అని తేలిగ్గా తీసుకో గలుగుతాం. అయినా, ఒకరికి మన హృదయాన్ని గాయపరిచే హక్కు ఎక్కడిది? ఒకరు నొప్పించాలని చూసినా ముందు వెనక చూసుకోకుండా అమూల్యమైన మన హృదయాన్ని కలవర పెట్టుకుంటామా? అయినా సూర్యుని అంతటి మహా శక్తి ఎలాంటి భేషజాలకి పోకుండా, అందరిని సమ దృష్టితో చూస్తున్నప్పుడు, అనంత విశ్వంలో ఒక అణుమాత్రమే అయిన మనిషి భేషజాలకి పోవటం తగునా?

మరుసటి రోజు సూర్య దర్శనం గురించి మాట్లాడే ముందు, ఈ రాత్రి వెన్నెల సోయగం గురించి చెప్పుకోవాలి. పగలంతా జీవన సమరం చేసి అలసి పోతే, హాయిని పంచి మనసుని మాయ చేసేది ఆ వెన్నెల కెరటమే కదా? మన జీవన సమరాన్ని సమర్ధంగా నడపటానికి సూర్య చంద్రులు అంతగా కష్టపడుతుంటే, వాటిని గమనించనైనా గమనించకుండా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాంఘీక ముఖాలు(సోషల్ మాస్క్) ధరించి, నేను ధనికుడిని అని కొందరు, నేను తెలివైన వాడిని అని ఇంకొందరు, నేనో బిజీ పర్సన్ అని మరికొందరు, అవతలి వాడు చేతకానివాడనో, తెలివితక్కువ వాడనో, ఉపయోగంలేనివాడనో అనే అభిప్రాయంతో కొందరు, నీచ బుద్దితో కొందరు, చెడు అలవాట్లతో ఇంకొందరు, అసలు నాకేమి తెలియదు అనే అభిప్రాయంతో ఎందరో గడిపేస్తు ఉంటే, వాళ్ళని చూసి జాలి వేస్తూ ఉంటుంది. సూర్య చంద్రులు, ఒక రోజుని బాలన్స్ చేసుకున్నట్లు, మనిషి తన జీవితాన్ని బాలన్స్ చేసుకోలేక, ఈ కారణాలన్నీ చెప్పుకుంటూ ఉంటాడేమొ.

అందరూ చేరే మరుభూమి ఒకటే, అందుకే పరదాలు (ఇంటి కిటికీలకేసినవే కాకుండా, ముఖాలకి, మనసులకి వేసినవి కూడా) తొలగించి, ఓ తూరుపు కిరణం, ఓ వెన్నెల కెరటం మనపై సారనిస్తే, ఆ జీవన రీతే చాలా వైవిద్యంగా ఉంటుంది.
--విజయ