Monday, January 23, 2012

నా డెయిరీ లో ఒక ఉదయం

కిటికి తెర తీసి బయట ప్రపంచాన్ని చూట్టానికి, వెచ్చటి వెల్వెట్ బ్లాంకెట్ అలానే చుట్టేసుకుని లేచి కూర్చున్నాను. రాత్రి అంతా మంచు కురిసిందేమో, తెల్లటి మంచు వెండి కొండలై మెరిసిపోతోంది. ఇంకా మంచు పూలుగా పడుతూనే ఉంది. సూర్యుని కిరణాలు తగిలి ఇంకా మెరిసిపొతోంది. ఒక బ్లూ జే పక్షి అలా ఎగురుతూ వెళ్ళింది. నా కళ్ళు దాని వెనకాలే తిరిగాయి. అబ్బా నేను ఒక విహంగం ఐపోతే అని అనిపించింది. నా అంత పెద్ద విహంగం ఆకాశంలో ఎగిరితే చుట్టానికి అంత బాగోదులే అని సరిపెట్టుకున్నాను. ఐనా ఆ బ్లూ జే కి వెల్వెట్ బ్లాంకెట్ లేదు కదా, పాపం దానికి చలి వెస్తుందేమొ దాని జీవితం కన్న నా జీవితమే బెటర్ అని కూడా అనుకున్నాను. మరో వైపు నుంచి ఒక ఉడుత వచ్చింది దొంగ చూపులు చూస్తూ. దాన్ని చూడగానే 'ఉడతా ఉడతా ఊచి, ఎక్కడకెళ్ళావు ఊచి ' అని అడిగేసా, అదేమొ బెదురుగా చూస్తూ తుర్రుమన్నది. పక్కింటి బిల్లీ తన కుక్కని (తప్పు కుక్కని కుక్క అనకూడదు, వాళ్ళ బాయ్ ని) తీసుకుని బయటకి వచ్చాడు. మళ్ళీ నాకు 'కుక్క కావాలి ' అనే పాట గుర్తు వచ్చింది. విశ్వాసంగా, ఆటలాడుతూ ఒక చిన్ని శునకం ఇంట్లో తిరుగుతూ ఉంటే బానే ఉంటుంది, కాని మరి దాని వెనకాల ఉండే పని మాటేమిటి అని అనిపించి ఆ ఆలోచనని విరమించుకున్నాను. ఇంతలో, నా ఆలోచనలతో తనకేం పనిలేనట్లు, ఒక నల్లని కారు సర్రున దూసుకు పోయింది. అంతేలే, ప్రపంచానికి నాతో పని ఏంటి అనుకున్నాను. అయినా ఇంత చిన్ని కిటికిలో నుంచి చాలా ప్రపంచమే కనిపిస్తోంది.

బిజినెస్ మాన్ సినిమా చూసిన మహాత్యం ఏమో (దేవుడిని అది కావాలి ఇది కావాలి అని అడగటమే తప్ప, నువ్వు ఎలా ఉన్నావు దేవుడా అని ఒక్కరు అడగరు అని డయిలాగు) శివయ్యా, కేవలం పులి చర్మంతో ఆ కైలాసంలో అంత మంచులో ఎలా ఉంటున్నావయ్యా అని అనుకున్నాను. పైగా మిసెస్ శివ తో తాండవం కూడా చేస్తూ ఉంటాడు అంత చలిలోను. పాపం మిసెస్ శివ కి కూడా వెల్వెట్ బ్లాంకెట్ ఉండదు, పైగా శివుడు డాన్సు కి రమ్మంటే 'నో ' కూడా చెప్పలేదు. నేనైతే, ' నో వే హోసే ' అని చాలా ఈజిగా చెప్పేయగలను. తనకన్నా నా జీవితమే మెరుగు అని ఇంకోసారి అనుకున్నాను.

ఒకసారి విశ్వం మీద అనుమానం వచ్చింది. నాకు ఇక్కడ ఇంత అందంగా కనిపిస్తున్నా, ఇంకెక్కడో ఎవరికో సునామి చూపిస్తూ ఉంటుందేమో అని. పోవే నువ్వొట్టి మోసకారివి, ఎప్పుడు ఒకేలా ఉండవు, అందరికి ఒకేలా కనిపించవు అని తిట్టేసుకున్నాను. ఈ భూమి, ఆ మాటకొస్తే ఈ విశ్వం అందరి సొత్తు కదా? అందరు సమాన హక్కులతో పుట్టలేదా? అదంతా ఏమో కాని, everyone has right to live productive life అని అనిపించింది. 'సర్వే జనా సుఖినో భవంతూ ' అని మనసారా ఆ వెంకన్నకి దండం పెట్టుకున్నాను.
--విజయ