Thursday, December 31, 2009

ను ను ను నువ్వా?

ను ను ను నువ్వా? అవును నువ్వే నువ్వే!!! అని నేను అనేది 2010 ని చూసి. నిన్న, మొన్నేగా 2009 అని రాయటం అలవాటు చేసుకున్నది? ఏంటి అప్పుడే వచ్చేసావ్ నువ్వు? నీదేముందిలే సడిచప్పుడు లేకుండా వచ్చేసి, వెళ్ళే ముందు మాత్రం ఏదో ఒక కోలాహలం లేదా కలహలం రేపెట్టి వెళ్ళిపోతావ్. కొత్తగా చెప్పుకోటానికి ఏముంది? షరమాములుగా, ఎండతో కాల్చేస్తావ్ లేదా చలితో చంపేస్తావ్, తుఫానుతో ముంచేస్తావ్ లేదా కరువుతో కాటేస్తావ్. ఈ సంవత్సరం ఏకంగా రాష్ట్రాన్నే పోటెత్తించావ్.

ఒక్క నీకోసం ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎదురుచూస్తారు నీకు తెలుసుకద.ఎవో కొత్త ఆశలతో ఆనందం వున్నా లేకపోయినా లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని నీకు స్వాగతం చెప్తారు. నువ్వోస్తావు కొత్తవెలుగులని విరజిమ్ముతూ, ఏంటో ఈ రొజుతో ప్రపంచమే మారిపోతుంది అనిపిస్తుంది. నిన్న లేని అందమెదో నేడు కలిగినే అని పాడుకొవాలని అనిపిస్తుంది.

ఆ తరువాత మొదలవుతుంది నీ విశ్వరూప సందర్శనం, గడచిన సంవత్సరం ఏం చేసావు, ఒక మైకెల్ జాక్సన్ ని ఒక రాజశెకర్ రెడ్డి ని నీతో తీసుకెల్లిపోయవు, స్వైన్ ఫ్లూ, డెంగ్యు అంటు అంతు పట్టని రోగాల్ని తెచిపెట్టి అందరిని పీడించావు.ఎంత మంది బలయ్యారు, నీకెంటిలే నువ్వు సవత్సరానికి ఒక మారు మళ్ళి మళ్ళి పుడ్తునే ఉంటావు, నీకెం తెలుస్తుంది జనాల బాధ. ఇప్పుడు ఛూడు మావాళ్ళందరు రాష్త్రం నాది నాది అని ఎలా కొట్టుకుంటున్నారో,ఇవన్ని నువ్వు తెచ్చిన మార్పులే కద. మమ్మల్ని అందరిని తోసెసుకుంటు నువ్వు ముందు కెళ్తూనే వుంటావు. అమెరికాలో ఆర్దికమాంద్యానికి ప్రపంచ దేశాలన్ని కుదేలై పోయాయి.

కాస్త బాగుపడ్తున్నాం అనుకునే సమయంలో ఒక సునామి లేదంటే ఒక వరదబీభత్సం ఏదో రకంగా నాశనమె తప్ప ఇంకేమయినా మిగిల్చావా ? వేడుకుంటున్నాం గడచిన కాలమే మంచిదనేలా చేయకు, 2010 లొ అయినా ప్రపంచ శాంతిని అందించి వినాశనాలని జరగనీకుండా మానవాళి మనుగడకు సహకరించు.

అయ్ బాబోయి నువ్వా ను ను నువ్వా మళ్ళి వచ్చెవా, మాకేం తెచ్చేవో అని మేము భయపడెలా చేయకు. 2011 లో అయినా నువ్వేనా మా నువ్వేనా, నీ రాక కోసం నిలువెల్ల కనులై మేమంత వేచేములే అన్నట్లు తీపి ఙ్నాపకాలని మిగుల్చు.

బ్లాగు మిత్రులందరికి నూతనసంత్సర శుభాకాంక్షలు.
--భారతి

Saturday, December 26, 2009

రక్షించు దేముడా మీడియా నుండి


మన మీడియా చేస్తున్న అరాచకం ఏలా ఎదుర్కొవాలో నాకేం అర్దం కావట్లేదు. అతి సర్వత్ర వర్జియేత్ అని పెద్దలు ఊరికే చెప్పలా, దూరదర్శన్ వున్నప్పుడు ఎప్పుడూ పాలు చేలేనా పందుల పెంపకమేనా అని ఏడ్చెవాళ్ళం . ఇప్పుడు ఈ టి వి, ఆ టి వి అని 20 చానెల్స్ వచ్చాయి. అందులో కొన్ని 24 గంటలు న్యూస్ చానెల్స్.

కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చిన ఈ చానెల్స్ రేటింగ్ పరుగులో మనం ఎంతగా బలైపొతున్నమో తల్చుకుంటే ఏడుపు వస్తుంది.

ప్రతిదాన్ని ఎంతగా వక్రీకరిస్తే అంత స్పెషల్ న్యూస్, ఎ. బి .ఎన్
చానల్ వాడు గవర్నెర్ రాసక్రీడలు చుపించాడూ, సరే అది సమ కాలీనం లో జరిగిన విషయం చూపించారు, దానికి బదులుగా ఎన్. టి .వి కి విషయమేమి దొరకలేదు, జాతిపిత గాంధి, మొదటి ప్రధాని జవహర్ లాల్ మొదలుకుని ఇప్పుడున్న రాహుల్ గాంధి ల ప్రేమ కహానిలన్ని వారిని అగౌరవంగా చిత్రీకరిస్తు పసి పిల్లలకు సైతం అర్దమయ్యేలా చానల్ లో చూపించాలా, అది అంత అవసరమా, మా 'చిన్నూ' కి మహత్మా గాంధి ఎంత గొప్పవాడో మన దెశానికి స్వాతంత్రం ఎలా తెచ్చాడో చెప్పి ఆయన మీద పెంచిన గౌరవం ఇలాంటి న్యూస్ తో అంతం అవదా, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే కద.

ఆ మహానుభావులు మంచి వాళ్ళు కాదు అని చిత్రీకరిస్తున్న ఇలాంటి చీడపురుగు జర్నలిస్ట్ లని ఏం చేయాలి టి. వి చూడటం మానేయండి అంటారు అంతేనా.

పసి పిల్లలు ఎదైనా తప్పు చేస్తే యాగి యాగి చేస్తారు రేపు ఆ పిల్లల జీవితం ఏమవుతుంది అని కూడ ఆలోచించరు, కరడుగట్టిన మోసగాళ్ళని తీవ్రవాదుల్ని ముసుగులేసి చూపిస్తారు,

ఇప్పుడు జరుగుతున్న ఈ భీబస్తకాండకి స్వార్ద రాజకీయనాయకులెంత కారణమో వాళ్ళని మోస్తు తిరుగుతూ ప్రతి వాడి నోటి దగ్గర మైక్ పెట్టి వాళ్ళ అడ్డమైన వాదనల్ని ప్రజలకి చేరవేస్తు ప్రజలని రెచగొట్టడం లో మీడియా పాత్ర తక్కువేం కాదు.


ఎంత మందికి ఇది మంచి ఇది చెడు అని విశ్లెషించునే వివేకం వుటుంది, అలాంటి అమాయకమైన విద్యార్దులని, ప్రజలని తప్పుదారి పట్టించడంలో మీడియా దే పెద్ద పాత్ర.


లాభం లేదు వీళ్ళ నోరు మూయించాలి నిన్న హై కోర్ట్ న్యూస్ నిలిపివేయండి, అని ఆర్డర్ చేసినట్లుగా మిగితా వాళ్ళందరికి కూడా బంధనాలు వేయాలి. రేటింగ్ పిచ్చిలో పడి కొట్టుకుపోతున్న మీడీయా ముక్కుకు తాడు వేయాల్సిందే.


నాకు పాలు చేలు చాలు, ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు,
రక్షించు దేముడా ఈ కుహానా రాజకీయనాయకుల నుండి, ఈ మీడియా గ్రద్దల నుండీ నన్ను నా దేశ ప్రజలని రక్షించు.

-భారతి

Wednesday, December 23, 2009

మెర్రి క్రిస్ట్మస్



అబ్బా నేను హిందూనే, ఐతే ఏం క్రిస్ట్మస్ చేసుకోకూడదా? మరి మనకి సౌభ్రాతృత్వం ఎక్కువ కదా? అన్ని మతాలని, సంస్కృతులని ఆదరించే అపురూపమైన నడవడికని మనకి మన సంస్కృతి నేర్పుతుంది కదా? పరమత సహనం మన సంస్కృతిలో ఒక భాగం కదా? మరైతే నేను 'ఈద్ ' సెలెబ్రేట్ చేసుకుంటానా అంటే? చేసుకుంటాను, నా చుట్టూ ముస్లిం స్నేహితులున్నప్పుడు. ప్రతి పండుగకి ఎంతో అర్థం, ఎంతో చరిత్ర, ఎన్నో సాంప్రదాయాలు ముడిపడి ఉంటాయన్నది నా అభిప్రాయమైతే, మెలేచ్చ సంస్కృతి అనకోడం కొందరికి పరిపాటి. ఆస్తికులై ఉండి కూడా, అటు వినాయుకుని పూజ కాని, ఇటు క్రిస్ట్మస్ గాని చేసుకోని వాళ్ళని ఏమందాం మరి?

ఒకప్పుడు కుటుంబాలు అన్ని కలిసి ఉండేవి, రోజు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ బ్రతికే వారు. వారికి ప్రత్యేకంగా ప్రేమికుల రోజు, తల్లి రోజు, తండ్రి రోజు, స్నేహితుల రోజు ఇలా అవసరం లేదు. కాని ప్రపంచం అంతా కుగ్రామంగా మరిపోయిన ఈ రోజుల్లో, కుటుంబ వ్యవస్థ చాలా మారిపోయింది. భార్యా ఇండియాలో, భర్త అమెరికాలో, కొడుకు జపాన్లో ఉంటున్న రోజులివి. పోని ఒకే ఇంట్లో వుంటున్నా, ఎవరి హడావిడి వాళ్ళది. ఆలాంటప్పుడు, భార్య, భర్తకి ప్రేమికుల రోజని ఓ చిన్న బహుమతి, ఓ ప్రత్యేక వంటకం చేస్తే తప్పేముంది. ప్రేమికుల రోజుతో వచ్చిన చిక్కల్లా, వృద్దులు, నడివయలు వాళ్ళు చేసుకోటం మానేసి, యువతీ, యువకలు మాత్రమే చేసుకుంటున్నారు. అది కేవలం మనకెందుకులే అని వృద్దులు, నడి వయసు వాళ్ళు వదిలేయటం మూలంగానే. ఒకసారి మనసుపెట్టి చూస్తే, ప్రేమికుల రోజులో ఎంతో విషయం కనిపిస్తుంది. అలాగే ముగ్గురి పిల్లల్ని కన్న తల్లి, యే ఒక్కరు దగ్గరలేక తల్లడిల్లుతున్న తల్లికి, మథర్స్ డే రోజు, చిన్న కానుక, ఓ ఆత్మీయమైన మాట మాట్లడితే, దాన్ని పర సంస్కృతిగా అభివర్ణించుకోటం ఎందుకు? మీడియా ఇంకా వ్యాపార సంస్థలు ప్రతీ అవకాశాన్నీ వాడుకుని తమ తమ లాభార్జనకు పోటిపడుతూనే ఉంటాయి, కాని మనం వివేకవంతులైతే, ఎవరి తాహతుకి తగ్గట్లు వాళ్ళు, పండుగని పండుగలాగానే జరుపుకుంటాము కాని పండుగని ఒక కాపిటలిస్టిక్ ఈవెంట్ గా చూడము. ఇలా ఎందుకంటున్నాను అంటే, ఈ మధ్య ఒక ఓటింగ్ పోల్ చూసాను, క్రిస్ట్మస్ సాంప్రదాయ పండుగకన్న, ఒక కాపిటలిస్టిక్ ఈవెంట్ గా మారిపోయింది అని.

ఏది ఎమైనా క్రిస్ట్మస్ తెచ్చే కోలాహలం, చిన్న చిన్న ఆనందాలు, అభినందనలు తెలిపే స్నిహితులు, తియ తీయని తీపి పధార్థాలు. కాంతులు విరజిమ్మే సిరీస్ బల్బులు వీటన్నిటిని ఎలా కాదనగలం? అందుకే అందరికి మెర్రి క్రిస్ట్మస్, మంచి మ్యూసిక్ వింటూ, చిన్నా పెద్దా అందరూ మంద్రంగా అయిదు నిముషాలన్నా డాన్స్ చేసి చూడండి, ఈ కులమతాల నషా కన్న ఎంతో అద్భుతంగా వుంటుంది ఆ ఫీలింగ్.
Santa Baby!!! Hurry down the chimney tonight and give me a pleasant smile on my face.

--Vijaya

Monday, December 21, 2009

నువ్వు నాతో లేవని

నువ్వు నాతో లేవని దిగులుగా ఉన్నాను
నేనెక్కడున్నా ప్రతినిముషం నువ్వు పక్కనేలేవేంటని వెతుకుతున్నా,
మనసేంటో మాట వినట్లేదు,
నీ ఆలోచనలతో నా నుండి దూరం వెళ్ళిపోయింది,
ఎన్నో చెప్పాలని ఉంది,
కాని మనసు మాటకు పదాలు కరువయ్యాయి .
నా పెదవులు నీ పేరే పిలవాలని ఆరాటపడ్తున్నాయికాని,
నా ఎదుట నీవు లేవని మాటలని, లోపలికి నెట్టేస్తున్నాయి.
నా కన్నీళ్ళు లోపలే ఉండాలా బయటకి రావాలా అని,
నిర్ణయించుకోలెక సతమతమవుతున్నాయి,
నీవు చూడకపోతేబయటకు వచ్చినా వ్యర్ధమని తటపటాయిస్తున్నాయి .
నా చేతులు నీ స్పర్శ అందక
ఒకదాన్ని మరోటి పెనవేసుకున్నాయి,
నా హృదయం ఆరాటపడ్తుంది ,
నువ్విక్కడేఎక్కడో వున్నావని చెప్తుంది,
నీ మీద నా ప్రెమెంతో నేనెలా నేనెలా చూపించను?
కొలతలు కొలమానాలు ఏవి లేవే?
నా గుండె చప్పుడు వినేంత దగ్గరగావచ్చి చూడు ,
ఇలా ఇంకో సారి నన్ను విడిచి వెళ్ళవు .

--భారతి

Tuesday, December 15, 2009

'పా' హిందీ మూవి- ఆస్కార్ కి అర్హత ఉందా?

ఈ సినిమా నేను చూడటానికి కారణం ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను చదవటం ఒక కారణమైతే, ఇంకో కారణం, ఇళయరాజ మ్యూసిక్ కంపోస్ చేయటం. సినిమా బాగుంది కాని, ఆస్కార్ కి అవకాశాలు నాకు అందులో ఏ మాత్రం కనిపించలేదు. ఇళయరాజ బాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నిరిక్షణ లో 'ఆకాశం ఏ నాటిదో, అనురాగం ఆ నాటిది ' ట్యూన్ తో సాగె 'గుం సుం హో క్యోన్ తుం' పాట బాగుంటుంది. అలాగే 'ముడి ముడి మై ఇత్తెఫాక్ సే' మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటుంది.

తెలుగులో 'భారతీయుడు ' చూసాక, ఇంగ్లిష్ లో 'క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ ' చూసాక, అమితాబ్ ప్రోస్తెటిక్ మేకప్ అబ్బురంగా ఏమి అనిపించలేదు. ఇక అమితాబ్ నటన విషయానికి వస్తే, ఎన్నో సవంత్సరాల నటనానుభవం ఉన్న అమితాబ్, 'ఆరో ' పాత్రలో అంతకన్నా తక్కువగాను, అంతకన్నా ఎక్కువగాను నటించటానికి అవకాశమే లేదు. అమితాబ్ కాకుండ ఇంకెవరైన నటించి ఉంటే తప్పకుండా అబ్బురం కలిగేది.

ఇంక ఈ సినిమాలో అద్భుతంగా, అబ్బురంగా అనిపించింది విద్యా బాలన్ పాత్ర. అవకరం ఉన్న బాలుడికి, ఒంటరి తల్లిగా చాలా బాగా నటించి, ఆ నాటి స్మితా పాటిల్ ని, షభాన అజ్మి ని గుర్తు చేసింది. హాలిఉడ్ తో పోటి పడుతూ, ఎంతో కృత్రిమంగా ఉండే హిందీ కథానాయికలను చూసిన కళ్ళకి, విద్యా బాలన్ ఎంతో అహ్లాదంగా, అందంగా, హుందాగా కనిపిస్తుంది. 'గురు ' సినిమాలో ఐశ్వర్య కూడా అలా కనిపించలేదు.

రాజకీయాలు చెడ్డవి కావు, రాజకీయ నాయకుడికి అధికారంతో పాటు, భాద్యత ఉంటుంది, అని నిరూపించే ఎం.పి పాత్రలో అభిషేక్ చాలా బాగా సరిపోతాడు. ఆ నటన కన్నా, ఆ పాత్ర బాగా నచ్చేస్తుంది. సినిమాలో ఆరో లాగే, నేను ఒక 12 ఏళ్ళ పాపనై, అలాంటి ఎం.పిని కలుసుకోగలిగితే బాగుండు అనిపించింది.

విద్య, డాక్టర్ చదువుతూ ఉండి, ప్రెగ్నెన్సి పైనా అవగాహన లేనట్లు ప్రవర్తించిన తీరు, ఇద్దరి కెరీర్ల కోసం యే మాత్రం అలోచించకుండా తను తీసుకునే నిర్ణయం, హీరో పైన అకారణ కోపం అసహజంగా అనిపిస్తాయి. కాని అవకరం ఉన్న పిల్లవాడి ఒంటరి తల్లిగా, ఒక మద్యతరగతి డాక్టర్ గా చాలా సహజంగా అనిపిస్తుంది. ఆరో అమ్మమ్మ కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళగా, కూతురికి, మనవడికి అండగా నిలబడి కృంగి పోకుండా, ఆనందంగా జీవిస్తున్న పాత్రలో ముచ్చటగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడి ఇంటిని, ఒక మధ్య తరగతి డాక్టర్ ఇంటిని చాలా సహజంగా చూపిస్తారు. ఆరో చదువుకునే విద్యాలయం, అందులో విద్యార్థులు బాగుంటారు. ఇలాంటి విద్యాలయాలు ఎన్నో ఉంటే బాగుండు అనిపిస్తుంది.

నాకు నచ్చిన సన్ని వేశాలు. ఆంధ్ర రాష్ట్రం ముక్కలవుతున్న ఈ తరుణంలో, ఆరో రూపొందించిన ఎల్లలే లేని తెల్లటి గ్లోబ్. ప్రపంచమంతా ఒక చిన్న కుగ్రామంగా మారుతుంటే, సమస్యలన్ని వదిలేసి, నీ రాష్ట్రం, నా రాష్ట్రం అని తన్నులాడుకోటం చాలా శొచనీయం. నచ్చిన ఒక డైలాగ్, రాజకీయ నాయకుడు, స్వచ్చతకి ప్రతీకగా తెలుపు ధరిస్తాడు. మనిషి చనిపోయినప్పుడు, శోకానికి ప్రతీకగా కూడా తెలుపు ధరిస్తాడు. ఆరో అంటాడు, దేశం చనిపోతోంది అందుకే రాజకీయ నాయకులు తెలుపు ధరిస్తారు అని. హీరో మీడియాకి చురకలెయ్యటం బహు పసందుగా వుంటుంది.

మొత్తానికి మంచి సినిమా,ఎక్కడా సహజత్వం లోపించదు, కాని ఆస్కార్ కి అవకాశం అంటే అత్యాశే మరి.

--విజయ

Sunday, December 13, 2009

గుండెల్లో గిటారు మోగించావే

నాకు సంగీత పరిఙ్ఞానం అంతగా లేకపోయినా, ఐరిష్ ఫోక్ మ్యూసిక్ నుంచి, పాకిస్తాన్ సూఫీ మ్యూసిక్ వరకు అన్నీ వినేస్తూ వుంటాను. బాలమురళి గారి 'పలుకే బంగారమాయెనా ' క్లాసికల్ ఎంత ఇష్టంగా వింటానో, బియాన్సి 'ఆల్ ద సింగిల్ లేడిస్ ' హిప్ హాప్ అన్నా కూడా అంతే సరదా పడతాను. సంగీతం మహా సముద్రం, అందులో తేలియాడే అదృష్టం మనందరిది.

'ఏక్ నిరంజన్ ' సినిమాలో కంగనా రౌనత్, నా గుండెల్లో గిటారు మోగించలేకపోయినా, ఈ వీడియో లో మియా రోస్ మాత్రం 'వాట్ వుడ్ క్రిస్మస్ బి లైక్, వితట్ యు హియర్?' అంటూ నా గుండెల్లో గిటారు మోగించేసింది. ఆ అందం చందం, సునిశితమైన హావ భావాలు, శ్రావ్యమైన పాట, అన్నిటికి మించి ఆహ్లాదకరమైన చిత్రీకరణ, కొద్ది నిముషాల సేపు నన్ను కట్టి పడేసాయి. సింగిల్ ఇన్స్ట్రుమెంట్, సోలో మెలోడీస్ అంటే నాకు మరీ ప్రాణం. సంగీత విద్వాంసులకి, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న మియా రోస్ స్వంత కంపోసిషన్లో లోటుపాట్లు వినిపించవచ్చేమో కాని, నాకు మాత్రం ఈ అమ్మాయి గుండెల్లో గిటారు మోగించేసింది. మోగించటమే కాదు, నేను ప్రిపేర్ అయిపోయాను, వచ్చే సమ్మర్, మయామి బీచ్ లో, అలలను చూస్తూ, 'నువ్వో కల, అలలా నాలోపల, నీలా ఇలా ఎవరూ లేరే ఎలా?' అని పాడేసుకోవాలని. మా గానపెసూనాంబ ప్రభావంతో పాట ఎలగొలా నేను పాడెస్తాను గాని, గిటార్ రాదే ఎలా అని ఆలోచిస్తున్నా ప్రస్తుతం. టు టు టు టూ!!!!!

--విజయ

Thursday, December 10, 2009

నాది నాది అంటావు ఏది నీది?

మనిషి ముందు నేను, తరువాత నా కుటుంబం అనుకుంటాడు. ఎందుకంటే బ్రతుకులోని అనుభూతిని స్వార్దంతో మేళవించి తనది అనుకునే ప్రతిదాన్ని నిర్మించుకోవాలని తపనపడ్తూ జీవితం సాగిస్తాడు. ఆ క్రమంలో, నా ప్రాంతం , నా దేశం, నా ఇల్లు, నాది నాది అంటూ, విశ్వంలో ప్రతి పదార్థాన్ని సొంతం చేసుకోవాలని తాపత్రయపడ్తూ బ్రతుకుతుంటాడు. అంత వరకు మానవనైజం అని సరిపెట్టుకుంటే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగివుండేవి కావు. నా జిల్లా, నాకంటే నువ్వెక్కువ ఉన్నావు అంటూ, ఒకరినొకరు చంపుకుంటూ బ్రతికేది ఎవరైనా, సంపూర్ణ ఆయుశ్శు ఉంటే 80 ఏళ్ళు.

ఒక మొక్కని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, దానికి ప్రాణం ఉంది కదా అక్కడే ఉంటుంది. పుట్టినప్పటినుండి ఎన్నో ఫలాలనిస్తుంది ఇతరులకే, తను తినదు. ఎన్నో పక్షులకి ఆశ్రయమిస్తుంది, ఏమి ఆశించదు. బ్రతికినంత కాలం, ప్రాణవాయువుని ఇస్తుంది. నాది అని ఏమైనా అడుగుతుందా? ఒకోటి దాదాపు 300 ఏళ్ళు బ్రతుకుతుంది. మనకి తోడుండటానికి, సూర్యుడు ఏమి ఆశించకుండ వెలుగు ఇస్తున్నాడు, గాలి నిన్ను డబ్బులేమి అడగకుండ ప్రాణవాయువుని ఇస్తుంది. మనిషి ఏమిస్తున్నాడు? బ్రతికిన కొన్ని రోజులకి గాను స్వార్ధంతో పర్యావరణానికి చేటు చేస్తూ, రాబోయే తరాల వారికి కాలుష్యాన్ని నింపుతూ, నాది నాది అని కొట్టుకు చస్తూ, కొన్ని రోజులకి భూమి అనే పదార్ధమే సృష్టిలో నుండి కనుమరుగయ్యేలా, మానవజాతి మొత్తం అంతరించిపోయేలా, చాలా జాగర్తలు తీసుకుంటున్నాడు. అసలు సమస్యలన్ని పక్కనపెట్టి లేని సమస్యలని సృష్టించుకుంటూ, కాలాన్ని అద్బుతంగ్అ వెళ్ళదీస్తున్నాడు. ఆలోచించిన వాళ్ళు, నాది నాది అంటూ మన ఇంటిని మనమే తగలబెట్టుకుంటున్నాం అని వారికి అర్దం అయ్యేలా చెప్పగలిగితే బాగుండును.

--భారతి

Wednesday, December 9, 2009

ఇటీవల నన్ను అబ్బుర పరిచిన భారత దేశ ఆవిష్కరణలు

ప్రపంచానికి జైపూర్ ఫుట్ ని అందించింది మన దేశమే అయినా, ఇటీవల 'టైం' పత్రికలో ఇంకాస్త అభివృద్ది చేయబడిన జైపూర్ ఫుట్ గురించి చదివి దానికి '50 బెస్ట్ ఇన్వెన్షన్స్ లో' స్థానం దక్కడం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. అప్పటి కుత్రిమ కాలుకి, ఇప్పటి కుత్రిమ కాలుకి తేడ ఏంటంటే, అప్పటి కుత్రిమ కాలు, కాలు మాత్రమే లేని వారికి ఉపయోగ పడేది. ఇప్పుడు అభివృద్ది చేసిన కాలు, తొడ భాగం, మోకాలు లేని వాళ్ళకి కూడా అమర్చవచ్చు(ఇక్కడ బొమ్మలో చుపిన విధంగా). కాలు లేని పిల్లవాడు ఏకంగా కోతి కొమ్మచ్చి ఆడటం నిజంగా ఆనందకరమైన విషయం కదా? పైగా ఇది $28 కే దొరుకుతుందట. నాకు కనీసం వంద అయినా కొని, కాలు లేని పిల్లలకి ఇవ్వాలని ఉంది అతి త్వరలో.

ఇవాళ నన్ను ఆనంద పరిచిన ఇంకో విషయం ఏమిటి అంటే, భారత మానవుడి జన్యు క్రమాన్ని, భారత శాస్త్రవేత్తలు పూర్తి చేయటం. కొంచెం ఆలస్యంగా అయినా, దాన్ని సాధించినందుకు చాలా ఆనందం కలిగింది. జన్యు క్రమాన్ని పూర్తి చేసి ఏమి చేయొచ్చు? నాకు తెలిసి, వ్యాధి కారక జన్యువులని ముందే గుర్తించి ఆ వ్యాధులు రాకుండ జాగ్రత పడొచ్చు. ఆమ్మో డబ్బు ఎక్కువేమో? అవును ఒక మనిషి జన్యు క్రమాన్ని పూర్తి చేయటనికి ఎన్నో సూపర్ కంప్యూటర్లు పని చేయాలట, కనీసం కోటిన్నర అయినా అవుతుందట. కాని ఇది మొదలు మాత్రమే. ఆ ఖర్చుని తప్పకుండా లక్షకి పట్టుకొచ్చే ప్రయత్నాలు 'హ్యూమన్ జీనోం ప్రాజెక్ట్' ముమ్మరంగానే చేస్తోంది.

ఇంకా చెప్పాలంటే నన్ను ఆనంద పరిచిన విషయం ఇంకొకటి కూడా వుంది, అదే కోపెన్ హాగెన్ సదస్సు కోసం భారత దేశం చాల కీలక మైన నిర్ణయాలే తీసుకుంది. అగ్ర రాజ్యాలు చేసిన చెత్తకి, తన వంతు బాధ్యతగా ఆ దేశాలన్నిటిని మించి ఎక్కువ శాతం కర్బన వ్యర్దాలని తగ్గించుకోటనికి ఒప్పుకుంది అంటే, నిజంగా పెద్ద హృదయం ఉన్నట్లే కదా. అంతటి సౌభ్రాతృత్వం భారతానికే చెల్లు. అందరం కలిసి ఈ పరిణామాలని హర్షిద్దాం.

అగ్ర రాజ్యాల ఆగడాలు, పేద రాజ్యల కష్టాల గురించి తప్పకుండా తదుపరి టపాలో ప్రస్తావించాలని ఉంది. బహుషా, సదస్సు తదనంతరం.
--విజయ

Monday, December 7, 2009

ప్రేమనేది



ప్రేమనేది ఒక అందమైన అబద్దం
నాకు నువ్వు, నీకు నేను అన్న భ్రమ...
కాలంతో పాటు మసిబారి మాయమవుతుంది!!
ఇద్దరి మధ్య హిపోక్రసీ ముసుగులా మొదలై...
అడ్డుగోడలా మారిపోతుంది!!
నువ్వూ, నేను చెరో పక్క పరిగెడతాం
అలిసిపోయి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే...
కనిపించేవి కేవలం ఙ్ఞాపకాల నీడలు!!

--భారతి