Friday, December 31, 2010

కొత్త కొత్తగా వున్నది


వీడుకోలె అంటు పాడాలా కొత్త కొత్తగా ఉన్నది అంటూ పాడుకుందామా, అన్నది ఇంకా డైలమాలోనే వున్నది. మొన్న మొన్ననే అయి బాబోయ్ నువ్వా అని భయపడి పోయాను. కాని చూడండి మళ్ళి వచ్చేసింది కొత్త సంవత్సరం. పనా పాడా హాపి హాపి గా రోజులు గడిపేసి మళ్ళి కొత్తగా పుట్టెస్తుంది. నాకు ఎన్ని పనులున్నాయో కాలానికెం తెలుసు. అయిన అనుకుంటాం కాని కాలం ఒక్కరోజు ఆగిపొతే మనం బ్రతకగలమా, రోజు గడవాలి మరొ కొత్తరోజు రావాలి సూర్యుడు తుర్పున వుదయించాలి పడమరన అస్తమించాలి. అప్పుడె కద మనిషి మనుగడ.
ప్రక్రుతి కరుణిస్తేనే మన బ్రతుకు, ఈ జలరాశి, ఈ కొండలు కోనలు, చెట్లు చేమలు ఇవ్వన్ని లేకుండా మనమున్నామా ఏంటి.వరద వెల్లువెత్తితే రైతు బ్రతుకు తెల్లవారిపొతుంది, అయినా మనకి మనం మనుషులం పెద్ద తెలివిగలవాళ్ళం అనుకుంటాం కాని దేముడు ఇచ్చిన ప్రక్రుతి ముందు మనమెంత.
అందుకని మనమేదో సాధించేశాం, అని నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టెసుకుంటాం అదెంటో మరి, అదెంటంటె ఈ మనిషనేవాదు ఎప్పటికైన నశించాలి అందుకు చాలా విపరీతాలు చేస్తాడు అని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడంట.ఆయనెలాగు చెప్పాడు కాబట్టి మనందరం కొట్టుకుని నాశనమైపోదాం అని మనొళ్ళంతా తీర్మానం చేసెసుకున్నారు, అందులో నెనైతే లేను, నేను ఆశావాదిని 2010 పోతే 2011 లేదా 2011 పోతే 2012 రాదా అని బోల్డంత ఆశతో ఎదురుచుస్తాను.
ప్రతి రోజు కొత్తగా 2010 అనిపించింది ఎందుకంటె చాలా రోజుల తరువాతా ఇంట్లో పాప పుట్టింది దాని ముద్దు ముచ్చట్లతో ఈ ఏడాది గడిచిపోయింది. 2011 కూడా కొత్త ఆశలకి ఊపిరిపోస్తుందనిశ్రీక్రిష్ణ కమిషన్ నివెదిక సర్వత్రా అమోదయొగ్యంగా వుంటుందని, మనందరం మళ్ళి సంతోషంగా 2012 కి స్వాగతం పలుకుతామని కలలుకంటూ నా కలలు నిజమవ్వాలని దేముడిని ప్రార్ధిస్తూ అందరికి,
నూతనసంవత్సర శుభాకాంక్షలు .

Friday, December 17, 2010

జీలకర్ర తో కుకీస్

ఈ మధ్య తీయటి కుకీస్ తిని చాలా బోర్ కొట్టేసింది. 'గుడ్ డే ' బిస్కట్లు బాగానే వున్నా, అవి కూడా చాలా బోర్.ఇంట్లో డానిష్ కుకీస్ వున్నాయి వాటికన్నా కూడా ఈ జీర కుకీస్ బాగున్నట్లనిపించాయి. ఇవాళ ఆఫీసులో అభిజీత్ పచారి కొట్లో కొన్న 'జీరా కుకీస్ ' తీసుకొచ్చాడు. అబ్బో అవి భలే బాగున్నాయి. మా గాన పెసూన లాగా, స్వీట్ నచ్చని హాట్ ప్రియులకి కూడా బాగా నచ్చేసేల ఎంతో రుచిగా ఉన్నాయి. ఐతే అవి పచారి కొట్లో కొనటం కన్న ఇంట్లో చెసుకుంటే ఇంకా బాగుంటయి అనిపించింది. అందుకే రెసిపి వెతికేసాను. తొందర్లో నేను కూడా ఇంట్లో తయారు చేయబోతున్నాను. ఇదిగో రెసిపి ఇక్కడ మీ అందరి కోసం. ఎవరైనా నా కన్నా ముందుగా చేసేస్తే ఎలా వచ్చాయో నాకు తప్పకుండా చెప్పండి.
కావలసిన వస్తువులు: 120 గ్రా వెన్న లెదా డాల్డా, 2 స్పూన్స్ పంచదార, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 కోడి గుడ్డు, 200 గ్రా మైదా1/2 స్పూన్ బేకింగ్ పౌడర్

చేసే విధానం:

1) వెన్న, పంచదర, ఉప్పు కలిపి వెన్న కరిగి తెలిక అయ్యేదాక బీట్ చేయాలి. ఎగ్, జీలకర్ర కూడ వేసి కలపాలి. ఈ మిశ్రమానికి, మైద కొద్ది కొద్దిగ చేరుస్తు, పింది గట్టిపడకుండ మెల్లిగ మ్రుదువుగ కలపాలి.

2) మిశ్రమాన్ని 15 నిమిషాలు చల్లారనివ్వాలి.

3) ఓవెన్ ని 180 డిగ్రీస్ దగ్గర ముందుగానె వేడి చేయాలి.

4) బేకింగ్ ట్రేకి వెన్న పూసి వుంచాలి.

5) పిందిని మందంగా పెద్దగా వత్తుకుని, కుకీ సైజ్ లో వున్న ఏదైన మూతతో, కుకీస్ కుట్ చేసి, ట్రే మీద అన్ని పేర్చి పైన మల్లి కొద్దిగ జీలకర్ర జల్లాలి.

6) 12-14 నిమిషాలు ఓవెన్లో బేక్ చేయాలి.
ప్రిపరేషన్ టైం : 20 నిమిషాలు.

ఇంపార్టంట్: నీళ్ళు వాడకుదదు, ఓవెన్ టెంపరేచర్, ఓవెన్ పవర్ని బట్టి సరి చేసుకోవాలి.

Friday, October 1, 2010

భయం గుప్పెట్లో మనం

మనం భారతీయులం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో పుట్టాము, మన పూర్వికులు చాలా కష్టాలు పడ్డారు, ఆంగ్లేయొలు వచ్చి మనని ౨౦౦ ఏళ్ళకుపైగా పరిపాలించారు, మహాత్ముని పుణ్యమా అని వచ్చిన స్వాతంత్ర్యాన్ని, మితి మీరిన స్వేచ్చగా అనుభవిస్తూ ఎవరికి వాళ్ళు మా ఇష్టం, మా మతం, మా ప్రాంతం , మా భాష అంటూ విభజించాలని ఎవరికి వాళ్ళు అధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు,

దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు, అయోధ్య లో రామమందిరాన్ని కట్టించమని రాములవారు అడిగారా, రక్తపుటేరులు పారించి శవాల గుట్టలమీద మసీదు కూలగొట్టి రామ మందిరం కట్టారు, ఈ రోజు దేశమంతా భయం గుప్పెట్లో వుంది,
నీ పక్కవాడే నీకు శత్రువు ఐపోతాడు, హిందు ముస్లిమ్ భాయి భాయి నినాదమ్ మంట కలుస్తుంది, బెటాలియన్ల కొద్దీ పోలిసులు మీరు తప్పకుండా కొట్టుకోండి, అని చెప్పకనే చెప్తున్నట్లు కనిపిస్తుంది,

ఇది తెల్లారితే కె సి ఆర్ బెదిరిస్తున్నాడు, డిసెంబర్ తరువాత అటు చీమని ఇటు కూడా కదలనివ్వనని, అంతర్యుద్దం తప్పదని, సామాన్య ప్రజలకి పొద్దున లేస్తే బ్రతుకు బండి నడిపించడానికి ఎన్నో సమస్యలు, ఒక వైపు ధరలు ఇంకో వైపు వరదలు, తెల్లారితే పాలు దొరకవు నీళ్ళు రావు, కూరల ధరలకి రెక్కలొచ్చాయి, ఎలారా భగవంతుడా రోజు గడిచేది అని బ్రతుకుబండి లాగే సామాన్యులకి రోజుకో అదనపు సమస్య, చదువుకోమని పట్నం పంపించిన కొడుకు తెలంగాణా కోసం శవమై పోయాడని తెలిసిన తల్లి తండ్రులకి ఈ సో కాల్డ్ రాజకీయనాయకులు ఏం న్యాయం చేయగలరు.

ఎట్టకేలకు న్యాయమూర్తులు సమన్యాయం తీర్పు ఇచ్చారు, అలాగే తెలంగాణా విషయం లో కూడా సరైన న్యాయాన్ని జరిపించగలిగిన శక్తి శ్రీ క్రిష్ణ కమిటీకి వుండాలని దానికి ప్రజలందరు కట్టుబడి వుండాలని, ఈ భయం నీడ నుండి బయట పడీ పిల్లలందరు చక్కగా చదువుకోవాలని ఆశిద్దాం.

భారతి

Tuesday, September 28, 2010

మరువలేని రోజులు మరల రాని రోజులు


గుర్తుకొస్తున్నాయి అంటు ఏమైనా రాయాలంటే, గూడంటే గూడూ కాడు మేడంటే మేడా కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అనే పాట కి ప్రతిరూపం మా ఇల్లు, నిజంగా పొదరిల్లు మాదిరే ఇంటి ముందు పందిరి వుండెది, సన్నజాజులు రాధామనొహరాలు మాధవిలత కలగలిపి అల్లుకున్న పందిరి, ఇంక అమ్మ పెంచిన తోట గులాబీలు లిల్లీలు మల్లెలు, వీటన్నింటితో పాటు మేము ముగ్గురం అమ్మాయిలం కలిసి పెరిగాం.


అతి గారాబం చేసే నాన్న, అదుపులో పెంచాలని చూసే అమ్మ, కస్టమంటే తెలియకుండా ఎప్పుడు పెరిగిపోయమో కాలానికే కాని మాకు తెలియదు,ముగ్గురం చాలా ఫొడవుగా వుండటం తో ఎంతో పెద్దవాళ్ళమైపొయామని భావించే వాళ్ళు అందరు.

అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ముగ్గురిని వదిలేసి వెళ్ళేది. అప్పుడొచ్చేది కొట్టుకునే స్వేచ్చ అందరి గిల్లికజ్జాలూ తీరేలా కొట్టేసుకుని అమ్మొచ్చేసరికి గప్ చిప్ ఐపోయేవాళ్ళం, ఇక్కడొ విషయమేంటంటె మా చిన్ని రాక్షసి మాత్రం దెబ్బలాటలో గొంతు పెంచి ఏడ్చి చీమిడి ముక్కుతో దుబ్బు తలతో నాన్న పనిచేసే మిల్లు పక్కనే వుండటం తో నాన్న దగ్గరికి వెల్తా అని పరిగెత్తేది, ఇంక తనని పట్టుకుని బ్రతిమిలాడి ఎంత చేసినా
అమ్మొచ్చే దాకా ఏడుస్తూనే వుండేది ఇంకేముంది అమ్మతో అందరికి పడెవి తన్నులు,ఐనా అల్లరి మానేవాళ్ళమా.

ఎప్పుడూ ఆటలే పక్కన వెంకట లక్ష్మి ఆంటి పిల్లలు ముగ్గురు మేము మొత్తం ఆరుగురితో పెరడంతా హోరెత్తిపోయేది, ఎప్పుడు పెద్దవాళ్ళ్మయ్యామో తెలియదు, ఒకరోజు హటాత్తుగా నేను ఇంటికొచ్చే సరికి ఇంట్లొ ఎవరో కూర్చుని వున్నారు ఆ అంటు నోరు తెరుచుకు వెళ్ళిన నాకు అతనే పెళ్ళికొడుకు వారం రోజుల్లో నీ పెళ్ళి అని చెప్పారు, దాంతో బలవంతంగా బాల్యానికి గుడ్ బై చెప్పి హైదరాబాద్ వచ్చిపడ్డాను.



కొసమెరుపేంటో చెప్పాలా మా చిన్నికి ఇంకో బుల్లి రాక్షసి పుట్టి అచ్చు తను ఏడ్చినట్లే పెద్ద గొంతుకేసుకుని ఏడుస్తూ తను మామీద ఎలా సాగించుకునేదో అచ్చు తనమీద అలా సాగించుకుంటుంది హి హి హి.



భారతి

Monday, September 20, 2010

వినాయక నిమజ్జనం


వినాయకుడు నేను అంత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దేముడు, వినాయక చవితి వచ్చేంత వరకు గణేషుని ప్రతిష్టించి పిల్లలతో ఫూజ చేయించేంత వరకు చాలా బాగుంటుంది,

తరువాతే ప్రారంభమవుతుంది అసలు కథ వినాయకుడి కథ కన్నా వింతైనది వూరంతా వినాయకులే గణేషుని పేరుతో చందాలు వసూలు చేసి రోడ్డుకి అడ్డంగా పందిరేసి ప్రతిష్టించడం వరకు పర్లేదు, పొద్దున్నే మంత్రాలు బాగానే వినిపిస్తాయి. తరువాత మొదలవుతుంది సినెమా పాటల గోల అవి దాటామా,మూడో రోజు నుండి నిమజ్జనం పేరుతో జరిగే తంతు,

చావు డప్పులతో పిచ్చి గెంతులతో బాగ తాగేసి వూగిపోయే కుర్రకారుని చూసి భగవంతుడు ఎలా ఓర్చుకుంటున్నాడా అనిపిస్తుంది.

రాత్రంతా డప్పుల గోలే చిన్న పిల్లలు బి పి వున్న పెద్దవాళ్ళు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ఇది వరకు మూడో రోజు పదో రోజు అని వుండెవి ఇప్పుడు ప్రతిరోజు నిమజ్జనమే.

ఒకరికి మించి ఒకరు పెట్టే విగ్రహాలు కొండంత దేముడికి కొండంత పూజ చేయగలమా, ఎందుకు ఎటికేడు విగ్రహాల సంఖ్య సైజు పెంచేస్తున్నారు.

పర్యావరణం కాలుష్యమమై పోతుంది, ఈ పెద్ద విగ్రహాల
వెల్లువలో జలమంతా కాలుష్యమమై పోతుంది,దెముడు భక్తితో పూజించమన్నాడు, అంతే కాని కాలుష్య సారంలొ ముంచమన్నడా.

ఫెద్ద విగ్రహాల తయారి నిషేదించాలంటె వాటి తయారీ లో ఎందరో బ్రతుకుతున్నారని నిస్సహయత ప్రదర్శిస్తుంది ప్రభుత్వం.
మనం మారాలి మన పిల్లలని మార్చాలి నిజమైన భక్తి ష్రద్దలంటె ఎంటొ వారికి నేర్పించాలి

ఏటా జరిగే నిమజ్జనాలలో పెద్ద విగ్రహాలతో పాటు నీట మునిగి చనిపోయే యువకుల తల్లిదండ్రుల మనశ్శాంతికై గణేషుని ప్రార్దిస్తూ, ఈ ఏడాది అపశ్రుతులు జరగొద్దని ఆశిస్తూ,




భారతి

Tuesday, August 17, 2010

శ్రీ అరబిందో తన భార్య మృణాళినికి రాసిన లేఖలోని కొన్ని అంశాలు


ఆగుస్ట్ 15 అరబిందో జన్మదినం సందర్భంగా ఆయన రాసిన ఒక లేఖ.
ఆ మధ్య, శ్రీ అరబిందో తన భార్య మృణాళినికి రాసిన ఒక లేఖ చదవటం జరిగింది. అరబిందో, మృణాళినిల పయనం చివరి వరకు సాగలేదు. ఎన్నో విబేధాలు ఉండేవట. ఒక వైపు అరబిందో అందరిని స్వాతంత్రోద్యమం వైపు, భారత దేశపు వేదాంతం, ఆద్యాత్మికత వైపు మళ్ళిస్తూ ఉంటే, మృణాళని తన భర్తని ఎవరో కొందరు తప్పు దోవలో నడిపిస్తున్నారు అని అనుకునేదట. ఆమె సహకారం కోసం అరబిందో చాల ప్రయత్నమే చేసారని నాకు ఈ లేఖ చదివాక అనిపించింది. అరబిందో ధర్మంలో ఆమె పాలు పంచుకోకపోవటం విషాదమే. బెంగాలి లేఖని ఆంగ్లంలోకి తర్జుమా చేసారు. ఆ లేఖ కొంచెం సుధీర్గమే అందులో నాకు మరీ నచ్చిన కొన్ని అంశాలు తెలుగులో ఇక్కడ మీ కోసం.

30 ఆగస్ట్ 1905,

ప్రియమైన మృణాళినికి,
మీ తల్లితండ్రులు మరోసారి అదే బాధలోకి జారటం నాకు విశాదం కలిగించింది. వారి ఏ పుత్రుడు చనిపోయినారో నీవు తెలుపలేదు. బాధ వచ్చినప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంది? ఈ ప్రపంచంలో, నీవు సంతోషాన్ని కోరుకున్నప్పుడల్లా, బాధే ఎదురవుతుంది, ఆ బాధ ఎల్ల వేళల సంతోషం కోసం ప్రాకులాడుతునే ఉంటుంది. నిర్మలమైన హృదయంతో, సంతోషాన్ని, బాధని, దేవుని పాదాల దగ్గర పెట్టటం ఒకటే మార్గం.ఈ పాటికే నీకు తెలిసి ఉంటుంది, ఎలాంటి విధి గల వ్యక్తితో నీ జీవితం ముడిపడి ఉందో. నేను ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రజలలోకి భిన్నమైన వాడినని, నాకు అందరిలాంటి ఆచరణ, ఆలోచన సరళి, మనస్తత్వం లేదని, నా జీవిత ధ్యేయం వేరని. విలక్షణమైన భావాలు, అసాధారణమైన లక్ష్యం, నిర్దేశపూర్వకమైన ఉద్దేశాలు ఉన్న నన్ను అందరు పిచ్చివాడు అనుకుంటారు. ఆ పిచ్చితనమే విజయం సాధించిన రోజు, ఇంకా దాన్ని పిచ్చితనం అనరు, గొప్ప జ్ఞాని అంటారు. కానీ ఎంతమంది విజయాన్ని చూడగలరు? వెయ్యిలో ఐదారుగురు అసాధారణమైన వాళ్ళు ఉంటారు. ఆ ఐదారుగురిలో ఒకరు విజయం సాధించాగలరేమో.

ఆడవారి అంచనాలన్నీ, ప్రపంచీకరమైన సుఖ సంతోశాలతోనే బంధించి ఉంటాయి. నాలాంటి పిచ్చి వాళ్ళు భార్యని సంతోష పెట్టలేరు. పైగా దుఃఖాన్ని కలిగిస్తారు. ఈ కష్టాన్ని, మహర్షులు ఒక ఉపదేశంతో పరిష్కరించారు. అదే 'పతియే పరమ గురువు' . భర్త ధర్మాచరణలో భార్య పాలుపంచుకుని, అతని సంతోషంలో సంతోషాన్ని, దుఃఖంలో దుఃఖాన్ని పొందగలగాలి. కార్యాచరణకి సహాయపడి, ఉత్సాహ పరచగలగాలి. ఈ పిచ్చి వాడితో నీ పెళ్లి పూర్వ జన్మ కర్మ ఫలం అయ్యి ఉంటుంది. విధితో ఒప్పందం కుదుర్చు కోవటం మంచిది. కానీ ఎలాంటి ఒప్పందాన్ని ఎన్నుకుంటావు? అందరిలానే నీవు కూడా నన్ను పిచ్చివాడు అనుకుని తప్పుకుంటావా? పిచ్చివాడు బలవంతుడు, తను ఎంచుకున్న దారిలోనే పరిగేడతాడు. నువ్వు ఆపలేవు. అందుకని ఏడుస్తూ ఒక మూల కుర్చుంటావా? లేక ఈ పిచ్చివాడితో పాటు పరిగెత్తుతావ? కళ్ళులేని రాజుగారి భార్య కళ్ళకి గంతలు కట్టుకున్నట్లు, నీవు ఈ పిచ్చివానికి ఒక పిచ్చి భార్యగా ఉండగలవా?

నా పిచ్చి మూడు విధాలు. మొదటిది, నా విజయాలు, విజ్ఞానం, ఉన్నత విద్య, సంపద అన్నీ దేవుడివే, నా అవసరాలకు సరిపడా వాడుకుని మిగితావి ఆయనకీ తిరిగి ఇచ్చేయాలి. పశువులు కూడా పొట్ట నింపుకోవటానికి, కుంటుంబ అవసరాలు తీర్చటానికే కష్టపడుతాయి. నాకు నేను ఒక పశువులాగా, ఒక దొంగలాగ అనిపిస్తున్నాను. దేవుడికి ఇవ్వటం అంటే, మంచి పనులు చేయటమే. ఇతరులకి సహాయపడటం ఒక పవిత్ర కర్మ. శరణు అన్నవాళ్ళని కాపాడటం అంతకన్నా గొప్ప కర్మ. తోడబుట్టిన వాళ్ళకి సహాయం చేయటం ఒకటే కాదు, దేశమంతా నా తోడబుట్టిన వాళ్ళే. నీవేమంటావు ? నాతో వస్తావా? నా ఆశయాన్ని పంచుకుంటావా? మనం ఎంతవరకి అవసరమో అంతే వాడుకుని మిగితాది దేవుడికి ఇద్దాము. నీనేమి అభివృద్ధి చెందలేదని నీవు అంటుంటావు. ఇప్పుడు అభివృద్దికి ఒక దోవ చెప్తున్నాను. ఆ దోవలో నీవొస్తావా?

నా రెండో పిచ్చితనం ఈ మధ్య నన్ను కట్టిపడేస్తోంది, అదేంటంటే, ఏదో ఒకరకంగా నాకు ఆ భగవంతుని ప్రత్యక్ష దర్శనం కలుగుతోంది. ఈ రోజుల్లో మతమనేది సమయం సందర్భం లేకుండా దైవ స్మరణం చేయటం లేదా అందరిలో దైవ ప్రార్థన చేయటం లేదా దేవుని పట్ల బాహాటంగా భక్తీ శ్రద్దలు చూపటం వరకే పరిమితం. నాకు ఇవేమీ ఒద్దు. దైవమంటూ ఉంటే, ఆయన ఉనికిని అనుభవించే మార్గం కూడా ఉంటుంది. ఎంత కష్టమైనా అదే మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ మార్గంలోకి నిన్ను తెచ్చుకోవాలని ఉంది. ఎవరు నిన్ను ఇందులోకి లాగాలేరు. ని ఇష్టపూర్వకంగా నీవే రాగాలగాలి.

నాకున్న మూడో పిచ్చితనం, అందరు దేశాన్నిమైదానాలు, అడవులు, కొండలు, నదులు ఉన్న ఒక ప్రదేశంగా చూస్తే నేను మాత్రం తల్లిగా ఆరాధించి పూజిస్తాను. రాక్షసులు రొమ్ముపై కూర్చుని తల్లి రక్తాన్ని పీలుస్తుంటే, ఏ కొడుకైనా ఏమి చేస్తాడు? తీరిగ్గా కూర్చుని, భోంచేసి, ఆనందిస్తూ గడుపుతాడా లేక తల్లిని విడిపించటానికి ప్రయత్నం చేస్తాడా? నాకు తెలుసు, ఈ దిగజారిన జాతిని విడిపించగల బలం నాలో ఉందని. అది కండబలం కాదు. నా విజ్ఞాన బలం.

భార్య అంటే శక్తి, భర్తకి ఉన్న బలం. నీ దయతో ఆ బలాన్ని రెట్టింపు చేస్తావా లేక నాతొ విభేదిస్తావా? నీవంటావేమొ, గొప్ప విషయాలతో నాలాంటి సాధారణ మహిళ చేయగలిగింది ఏముంది, నాకంతటి బలము, తెలివి ఎక్కడివి, ఆలోచించటానికే భయంగా ఉందని. కానీ దానికి మార్గం ఉంది. దైవాన్ని శరణు వేడుకో భయం తేలిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళ మాటలేవి వినకుండా, కేవలం నా ఒక్కడి మాటలే వింటే, నా శక్తి నంతా నీకు ఇస్తాను. దానితో నా శక్తి తరిగిపోదు పైగా రెట్టింపు అవుతుంది. నీలో ఒక లోపం వుంది. ఎవరు ఏది చెప్పినా వినేస్తావు. అది నీ మెదడుని విశ్రాంతి తీసుకొనివ్వదు. నీ విజ్ఞానం పెరగనివ్వదు, పని మీద శ్రద్ధ నిలుపనీయదు. ఒకరి మాట విని జ్ఞానాన్ని పెంపుచేసుకో, మారిన ఆలోచనలతో ఏకాగ్రత సాధించి, ఒక ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాదించటం కోసం పని చేయి. ఇంకో లోపం వుంది, అది ఒక్క నీలోకాదు, ప్రజలందరిలో ఉన్నది. మతం, మానవత్వం, ఉన్నత ఆశయాలు, దేశ విముక్తి లాంటి తీవ్రమైన విషయాల గురించి వినే శక్తి లేదు. ఈ విషయాలన్నీహాస్యాస్పదం అనుకుంటారు. ఇలాంటి ప్రవర్తనని స్థిరమైన ఆలోచనతో వ్యతిరేకించాలి. ఒకసారి ఆలోచించటం మొదలు పెడితే, నీ నిజ ప్రవర్తన వికసిస్తుంది. సహజంగానే, వేరే వాళ్లకి సహాయం చేయటానికి, త్యాగానికి ముందుకు వస్తావు. ఇంకో లోపం కూడా వుంది, నీ మెదడుకి శక్తి లేదు. అది దేవుణ్ణి ఆరాదిస్తే వస్తుంది. ఇవన్ని నేను నీతో చెప్పాలనుకున్నాను. నీవు ఎవరికీ చెప్పొద్దు. నిశబ్దంగా నేను చెప్పిన వాటి గురించి ఆలోచించు. 'నా భర్త దారికి నేను ఆటంకం కాకూడదు, తనకి సహాయకురాలిగా, ఒక వాహకంగా నేను మారాలి' అని దేవునికి నీవు రోజు ప్రార్థన చెయగలవా?

నీ వాడు.

Saturday, July 24, 2010

కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు మరీ చిర్రెత్తిస్తున్నాయా?

సాఫ్ట్ వేర్ రంగంలో, అందులో కన్సల్టింగ్ రంగంలో ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య నన్ను భలే చిరాకు తెప్పించాయి

1) ప్రస్తుత ఉద్యోగాన్ని ఎందుకు వదలాలని అనుకుంటున్నావు?
మనసులో సమాధానం: ఎక్కువ జీతం కోసం లేదా ప్రాజెక్ట్ అయిపోయింది ఇంకొకటి వెతుక్కోవాలి కాబట్టి లేద ఇంటికి దగ్గరలో వుంది కాబట్టి.
చెప్పాల్సిన సమాధానం:పాత ఉద్యోగం చాలా బాగుంటుంది కాకాపోతే నా పరిఙానం పూర్తిగా వినియోగ పడటం లేదు. చేస్తున్న పని చాలెంజింగా లేదు.

2) మా కంపనీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నావు?
మనసులో సమాధానం: ఈ కంపని ఇంటెర్వ్యూ కి పిలిచింది కాబట్టి, ఇంకా వెరే కంపనీ ఇంటెర్వ్యూల కోసం వేచి వుండే ఓపిక లేదు కబట్టి. ఇదే కంపనీలో చేరాలని చిన్నప్పటి నుంచి నేనెమి కలగనలేదు. నాకంటు ఒక గుర్తింపు కోసం లేదా జాబ్ సెక్యూరిటి కోసం అని చెప్తే ఉద్యోగం రానట్లే మిగితా అన్నీ బాగా చేప్పినా కూడా.
చెప్పాల్సిన సమాధానం: ఈ కంపనీలో చేరటం నా కల. ప్రస్తుత నా అనుభవాన్ని ఈ కంపనీతో పంచుకుని, ఈ కంపనీ నేర్పించే మరెన్నో విశాయలని ఆకళింపు చేసుకుని కంపనీ విజయాలలో నేను పాలుపంచుకోవలనుకుంటున్నాను.

3)నీ బాస్ ఎలా ఉంటే నీ కిష్టం?
మనసులో మాట: పనిచ్చి చేసేదాక వెనకాల పడకునుండ వుంటే చాలు. ఓవర్ టైం చేయమనకుండా వుంటే చాలు. డిటెక్టివ్ లాగా నేను ఎప్పుడు యే పని చేస్తున్నానా అని గమనించకుండా ఉంటే చాలు.
చెప్పాల్సిన సమాధానం: మానేజర్ సహకారపూర్వకంగా వుంటే బాగుంటుంది. నేను ఇప్పటి వరకు పని చేసిన మానేజర్లు అందరు అలాగే వున్నారు. వారితో కలిసి పనిచేయటం నా అద్రుష్టం.

4) నీకు అనలిటికల్ స్కిల్స్ వున్నాయని నువ్వెలా చెప్పగలవు?
మనసులో మాట: అనలిటికల్ స్కిల్స్ వుండి వుంటే ఈ ప్రశ్న అడుగుతరాని ముందుగానే అనలైజ్ చేసి సామాధానం వెతుక్కుని పెట్టుకోవడం జరిగేది.
చెప్పాల్సిన సమాధానం. ఒక క్లిష్ట తరమైన సమస్యని మన అనాలిసిస్ ఉపయోగించి ఎలా పరిష్కారం చేసమో చెప్పాల్సి వుంటుంది తడుముకోకుండా.

5) ఇప్పటివరకు సాధించిన వాటిల్లో గొప్పది ఏది?
మనసులో మాట: నేనేమైనా సైంటిస్ట్ నా ఎదో కొత్త విశయాన్ని కనిపెట్టి ఇది సాదించాను అనుకోటానికి? రోజు వారి ఉద్యోగం చేయటము సాధించటమేన? వెనకట ఎవరో నేను ఇష్టపడ్డ అమ్మయిని చాలా కష్టపడి పెళ్ళి చేసుకున్నా అదే గొప్ప అచీవ్ మెంట్ అన్నాడట.
చెప్పాల్సిన సమాధానం: ఎప్పుడు డెడ్ లైన్ దాటకుండా వర్క్ కంప్లీట్ చేయటం.

6) పని వేళ తరువాత నువ్వేమి చేస్తు ఉంటావు?
మనసులో మాట: ఏమి చేస్తాం వంట చేస్తాం పిల్లా పాపకి ఙానం నూరిపొస్తా ఉంటాం. కాస్తా టీవి, కాస్త న్యూస్ పేపర్లు.
చెప్పాల్సిన సమాధానం: నేను పని చేస్తున్న టెక్నాలజి కి సంభందించిన అన్ని విశయాలు, వాటి అభివ్రుద్ది గురించి చదువుతూ ఉంటాను, వాటి గురించి బ్లాగ్ ద్వార అందరికి తెలియచేస్తూ వుంటాను. ఎనర్జీ ఇంకా స్త్రెంత్ కోసం ఆటలు వ్యాయం చేస్తూ వుంటాను.

7) మేము నీకు జాబ్ ఆఫర్ ఎందుకు ఇవ్వాలి?
మనసలో సమధానం: ఊరికే ఎమైనా ఇస్తున్నావా, పని వుంది, పని చేసె వాళ్ళు కావలి కాబట్టి ఇస్తున్నవు.
చెప్పల్సినా సమాధానం: నాకు ఈ వుద్యోగానికి కావల్సిన అర్హతలు, అరిఙానం, అనుభవం అన్ని వున్నాయి ముఖ్యంగా ఈ వుద్యోగం మీద నాకు ప్రత్యేకమైన శ్రద్ధ మరి ఇంకా నన్ను నేను నిరూపించుకోవలన్న తపన నాకు వుంది కనుక.

రాయాలి కాని పెద్ద లిస్టే వుంది నా దగ్గర. రాత్రి నేను, మా ఙాన పెసూన ఇవే విశయాలు మాట్లాడుకున్నాం. ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు హిపోక్రసీని పెంచుతున్నారు ఇలాంటి ప్రశ్నలు వేసి అనేది తన వాదన. ఇంటెర్వ్యూకి అటెండ్ అయిన అభ్యర్థి తనకేంటి అనేది చూసుకున్నా, కంపనీకి మనం ఏమి ఇవ్వగలం అనేది కూడా అలోచించాలి అందుకే అలాంటి ప్రశ్నలు వేస్తారు అని నేను చెప్తా వచ్చాను. ఇదే లౌక్యానికి, ముక్కుసూటితనానికి ఉన్న తేడా.

ఐ.ఎ.యస్. అభ్యర్థుల ఇంటర్వ్యూ ప్రశ్నలు మరీ కష్టంగా వుంటాయి. అలాంటి వాటికన్నీ ఎంతో ప్రిపేర్ అయి, సెలక్ట్ అయి, వాటిని ఇంటర్వ్యూలకే పరిమతం చేసి, నిజ జీవితంలో స్థానం ఇవ్వరు. మరి అప్పుడు హిపోక్రసీనా, లౌక్యమా మీరే తేల్చుకోండి.

--విజయ

Saturday, June 26, 2010

సూర్యుడి ముందు టార్చ్ లైట్


సూర్యుడి ముందు టార్చ్ లైట్ అంటే ఎంటో అనుకునేదాన్ని ఈ రోజు భోజనాల టైంలో వెంకట్ నాకు ఈ కింది విషయాలు చెప్పే వరకు. వెంకట్ సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసిన విషయంబెట్టిదనిన..

సీన్ 1)
వెంకట్ ఫ్లైట్ లో పక్క సీటు లేడి, ఓ చిన్న కాగితం ముక్క మీద రాసిన రెండు పారాగ్రాఫ్లని మళ్ళీ మళ్ళీ చాలా సేపు చదివేస్తుంటే, ఉత్కంట భరించలేని వెంకట్, మీరు చదివేది ఏమిటి, అది అంత ఇంటెరిస్టింగా ఉందా అని అడిగేసాడు. ఆ పక్కావిడ, ఇంటెరెస్టింగ్ ఏమి కాదు, ఇది నా ప్రొఫెషన్ అని చెప్పింది అట. మరో సారి ఉత్కంట భరించలేని వెంకట్ ఏంటండి ఆ ప్రొఫెషన్ అని మళ్ళీ ప్రశ్న వేసాడట. నేను F.B.I. కి పని చేస్తాను. హాండ్ రైటింగ్ చదివి మనుషుల మనస్తత్వాలని తెలుసుకోవటమే నా పని అని చెప్పాక. వెంకట్ మరో ప్రశ్న వేయలేదట.

సీన్ 2)
వెంకట్ రూం మేట్ గా వచ్చిన ఒక పెద్దాయన. అయనతో కలిసి డ్రైవ్ చేస్తూ వెంకట్ టయోట లెక్షస్ కారు 'ఆటో క్రూస్ ' గురించి వివరిస్తూ కారుని 'ఆటో క్రూస్ ' లో పెట్టెస్తే, ముందు ఉన్న కారు వేగాన్ని బట్టి, కారు వేగాన్ని సవరించుకుంటూ, అవసరమైన చోట స్లో డౌన్ చేసుకునే టెక్నాలజితో పని చేస్తుంది అని చెప్పుకొచ్చాడట. అంథ విన్న పెద్దయన. అవును నేను జపాన్లో ఆ టెక్నాలజి డెవలప్మెంట్ మీద చాలా ఏళ్ళు పనిచేసాను అని చెప్పే సరికి వెంకట్ మారు మాట్లడలేదట.


ఈ రెండు సంగతులు విన్నాక, ఎవరితో ఎదైనా మాట్లాడెటప్పుడు, సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేస్తున్నామేమో ఒకసారి అలోచించి మాట్లాడాలేమో అనుకున్నాను నేను.

--విజయ


Thursday, June 3, 2010

రెప్పచాటు స్వప్నం

చాలా సంవత్సరాల క్రితం నేను 'రెప్పచాటు స్వప్నం' అనే చైన్ సీరియల్ ఒకటి రాసాను, ఆంధ్రభూమి వీక్లీ లో, మొదటిభాగం నేను రాస్తే మిగితా భాగాలన్ని సాహితి మిత్రులందరు రాసారు, ఆ రోజుల్లొ ఆ విధానం చాలా విజయవంతం ఐంది. అలా సాహిత్య అభిలాష వున్న వాళ్ళు ఇప్పుడు నాలాగే బ్లాగు కూడా తప్పక రాస్తూ వుంటారని వూహిస్తున్నాను, ఎవరైన వుంటే చెప్పండి ప్లీస్. సాహిత్య అభిలాష వున్నవాళ్ళు ఖాళీగా వుండలెరు ఎదో ఒక విధంగా సాహిత్యాన్ని ఆస్వాదిస్థు వుంటారని ఆ రోజు భరణి కాంప్లెక్స్ లో కలిసిన మిత్రులెవరైనా వున్నారేమో అని నా ఆశ, ఉండి ఉంటె రిప్లై ఇవ్వండి బ్లాగులో కూడా అందరం కలిసి అలాంటిదేమైనా రాయాలని వుంది ఏమంటారు .

భారతి నాదెళ్ళ

Thursday, May 20, 2010

గాన పెసూన - వాహన చోదకం

మా గానపెసూన చిన్నతనంలో, తల్లితండ్రులు పిల్లల్ని ఫోటో స్టూడియోకి తీసుకేళ్ళి కీలు గుర్రం ఎక్కించ్చి ఫోటోలు తీపించేవారు. ఎవరి ఇళ్ళల్లో చూసినా పిల్లో, పిల్లవాడో కీలు గుర్రం మీద ఎక్కిన ఫోటో తప్పనిసరిగా ఉండేది. అలాగే మా ఇంట్లో మా గానపెసూన కీలు గుర్రం ఎక్కిన ఫోటో ఉండేది. ఎందుకో తెలియదు కాని మా నాన్నారు నన్ను, మా చిన్నక్కని కీలు గుర్రం ఎక్కించి ఫోటో తీపించలేదు. కీలు గుర్రం ఫోటోలంటే బోర్ కొట్టేసి అలా మమ్మల్ని ఫోటో తీయనందుకు నేను, మా చిన్నక్క తెగ సంతోషపడుతూంటే, మా గానపెసూన మాత్రం కీలు గుర్రం ఎక్కిన రాకుమారిలా తెగ ఆనందపడిపోయేది. మా ఇద్దరికేమో దుబ్బు లాంటి జుట్టు వేసుకుని, పెద్ద కళ్ళు పెట్టుకుని, పళ్ళు బిగబెట్టేసి, కీలు గుర్రం ఎక్కిన రాకాసిలా కనిపించేది. అలా కీలు గుర్రంతో మొదలైన గానపెసూన వాహన చోదకం ఇప్పటివరకు ఎలా కొనసాగుతోందో తెలియచెప్పాల్సిందే.

గానపెసూనని, చిన్నప్పుడంతా దూరం నడవలేదని, మంచి బడిలో వేయకుండా ఇంటి పక్కనే ఉన్న తురక మాస్టారు కాని బడిలో వేసారు మా నాన్నారు. తనే తురక మాస్టారుకి తెలుగు పాటలు చెప్పేసి వచ్చేది. తను వచ్చే వరకు నేను, మా చిన్నక్క బడి బయటే ఆడుకుంటూ ఒక్కోసారి గడ్డి పీకుతూ కూర్చునే వాళ్ళం. ఆ బడి ఎంతసేపు ఉండేది కాదు. అలా చిన్నప్పుడు మా గానపెసూన చదువుని అటక ఎక్కించారు మా నాన్నరు. ఆ తప్పు మళ్ళీ మా ఇద్దరిపట్ల చేయలేదు. వాహన చోదకం చేయకుండానే పదవ తరగతికి వచ్చేసింది. అప్పుడు నేను, మా చిన్నక్క 7వ తరగతి చదువుతున్నాం (నాకు తెలివి ఎక్కువ అయిపోయిందని గోల చేసి 6 చదవకుండానే 7 లోకి ప్రమోట్ చేపించుకున్నాను). మా చిన్నక్క నేను, మా నాన్నారి సైకిలుని తెగ తిప్పేసే వాళ్ళం. మా చిన్నక్క ఓ అడుగు ముందుకేసి, ఎవరు పెద్దగా నేర్పక పోయిన, తానే లూనా బండి నడపటం నేర్చేసుకుంది. తను నడపటం చూసి, గానపెసూన కూడా, ఒక రోజు లూనా పట్టుకుని బయలుదేరింది. అలా పట్టుకేళ్ళిందో లేదో ఇలా ఒక తురక పాదచారికి గుద్దేసింది. ఆయన, 'అల్లా దయతోని ఇవాళ నేను బతికిన, నాకు రేండు ఆడ పిల్లలున్నయ్, అన్యాయం జరుగుతుండే, దయవుంచి ఇంకెప్పుడు బండి నడపకు బేటీ " అని గానపెసూనని ప్రార్దించి మరీ వేళ్ళాడు. అతని ప్రార్థన మాహాత్యమో, లేక భయమే కలిగిందో, కొన్ని ఏళ్ళ వరకు గానపెసూన బండి మొహమే చూళ్ళేదు. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నా కూడా పోలో మంటూ సిటీ బస్సులోనే వెళ్ళేది కాని ద్విచక్ర వాహనం నడిపే సాహసం ఎవరు ఎన్ని చెప్పినా చేయలేదు.
నేను అమెరికా వచ్చి కార్ కొనుక్కున్నాక, అప్పుడు కొంచెం చలనం కలిగి. ద్విచక్ర వాహనాన్ని దూరంగా పెట్టి, చతుచక్ర వాహనాన్ని నడపటానికి సిద్దపడి ఏనుగు లాంటి సెకండ్ హాండ్ మాటీజ్ లో ఎక్కి కూర్చుంది. దాన్ని ఎన్నో రకాలుగా డక్కా ముక్కీలు తినిపించి ఎలాగొలా డ్రైవింగ్ నేర్చుకుంది. చెప్పొద్దూ, ఆ కారు కి సొట్టలేని ప్రదేశం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్లో నుంచి కారు పక్కకి జరపవమ్మ అని అంటే, నాకు జరపటం రావటం లేదు, నువ్వే జరిపి పెట్టు అన్న ఘనత మా గానపెసూనదే. తన ప్రయోగాలన్నిటికి, ఆ కారుని బాగానే వాడుకుని ఇప్పుడేమో కొత్త ఎర్ర కారు ఒకటి కొనుక్కుని మాటిజ్ ని మా నాన్నరి గుమ్మంలో పడేసి నన్ను చూడటనికి అమెరికా వచ్చింది. పడవలాంటి పెద్ద కారు కొనుక్కోకుండా బుల్లి బీమర్ కొనుక్కున్నావేంటి అని ఉన్నన్ని రోజులు నాతొ తగువేసుకుంది. అది కాక, నా కారు నడుపుతానని ఒకటే గోల. ఎక్కడ గుద్దేస్తుందో అని నాకు ఒకటే భయం. ఎలాగైతేనేమి ఒకరోజు నా కారు తిప్పేసింది. నీ బుల్లి బీమర్ ఏ మాత్రం బాగోలేదు, గోతిలో కూర్చున్నట్లుంది అని పెదవి విరిచేసి తాళం నా చేతిలో పెట్టేసింది. హమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాను నేను. ఆ మరుసటి రోజు బీచ్ కి తీసుకెళ్ళాను. అక్కడ ఊరికే ఉంటుందా? పారా సెయిలింగ్ చేస్తానని పారాచూట్ ఎక్కేసి, 'గాల్లో తేలినట్టుందే, గుండే పేలినట్టుందే' అంటు పాట ఎత్తుకుంది. ఆ తరువాత జెట్ స్కీయింగ్ కూడా చేస్తానంటు మొదలెట్టింది. అదేంటో జెట్ మాత్రం నా కన్నా తనే బాగా నడిపించి 'నువ్వు నాతో రా, తమాషాల్లో తేసుల్తా' అంటూ నాగార్జునాలా ఫీల్ అయిపోయింది. మేము దిగిన మోటెల్ వాళ్ళు సైకిళ్ళు అద్దెకిస్తున్నారు. నేను ఒకటి పట్టుకుని బీచ్ రోడ్ అంతా తిరిగేస్తూ వుంటే, నేనేమి తక్కువ కాదంటు తనూ ఒక సైకిలు పట్టుకుని నా వెనకే బయలుదేరి వెంటనే పడి కాలు నొప్పి తెచ్చుకుంది. నాకు నవ్వు ఆగలేదు తనకి రోషం ఆగలేదు.

ఆఫీసుకి పెద్ద పడవలాటి కారు బాగోదని చిన్న ఎర్ర కారు కొనుక్కుని తిరుగుతోంది. నేను ఇండియా వెళ్ళినప్పుడు, ఆ కారులో నన్ను బాగానే తిప్పింది. హైదరాబాదు వాహన ప్రవాహాన్ని, అక్కడి పద్మవ్యూహాలని, అభిమన్యులని చూసి, నాకు కళ్ళు తిరిగిపోయి వెనక సీట్లో కూర్చున్నాను. పక్కవాళ్ళు గుద్దేస్తూ వెళ్తారని, సైడు మిర్రర్స్ మూసేసుకుని నడపటం నాకు భలే అశ్చర్యం కలిగింది. ంత్తానికి నన్ను బానే తిప్పింది కారులో. ఇవాళ ఫోన్ చేసినప్పుడు తన కారు దొంగలెత్తుకెళ్ళినట్లు కలవచ్చింది అని తను చెప్పటంతో, నాకు ఇదంతా రాయాలనిపించింది. పడవంత కారు కొనుక్కుని అది నడపటానికి రోద్ మీద ఖాళీ లేక, పార్కింగ్కి ప్లేస్ దొరకక, ఎన్ని అష్టకష్టాలు పడబోతోందో గానపెసూన అని అలోచిస్తున్నాను.

--విజయ

Wednesday, April 28, 2010

గానపెసూనాంబ - మా పెద్ద దూడ

మా ఇంట్లో, మా గానపెసూనాంబకి, అప్పుడే పుట్టిన మా పెద్ద దూడకి మధ్య భలే అవినాభావ సంబంధం ఉండేది. ఒకరంటే ఒకరికి అవ్యాజమైన ప్రేమ. తన వెనకాలే మా చిన్నక్క, నేను ఉన్నాకూడా, మా పెద్ద దూడ మీద, గానపెసూనాంబకున్న సొదరి ప్రేమ తరగలేదు. మా పని బుడ్డాడు, గేదెల ఆలనా పాలనా చూసుకుంటా ఉంటే, మా పెద్ద దూడ పని మాత్రం తనే చూసుకునేది. తరువాత చిన్న దూడ పుట్టినా కూడా పాపం దాన్ని ఎవరు గారబం చేయలేదు. కనీసం మా పెద్ద దూడకి కట్టినట్లు కాలికి ఒక మువ్వ, మెళ్ళో ఒక చిన్న గంట కూడ ఎవరు కట్టలేదు. అయినా అది పాపం అమాయకపు చూపులతో భలే అందంగా ఉండేది. ఐతే మా చిన్న దూడ మగదట, అందుకని మా నాన్నారు ఎవరో వ్యవసాయదారునికి అమ్మేసారు దాన్ని. మేతకెళ్ళిన గేద, దాని దూడ ఒకోసారి ఇంటికి వచ్చేవి కావు. మా గానపెసూనాంబే వెతకటానికి వెళ్ళేది. అవి ఇంటికి రావటం మర్చిపోయి, కోటగట్టు దగ్గర చక్కగ గడ్డిమేస్తా ఉండేవి. మా పెద్ద దూడ, గానపెసూనాంబని చూడగానే, ఒంటికాలితో లగెత్తుకుంటూ, ఒకరకంగా పళ్ళికిలించుకుంటూ మరీ ఇంటికొచ్చేది. మా పెద్ద దూడంటే ఎంత ఇష్తమున్నా కూడా, అది పులుముకున్న బురదని మాత్రం గానపెసూనాంబ అస్సలు కడిగేది కాదు. మా చిన్నక్కకి, నాకు కొబ్బరి పీచు ఇచ్చి, తను నీళ్ళ పైపు పట్టుకుని నిలుచునేది. మాకు దొరికిందే చాన్స్ అని, దూడని తరువాత దాని తల్లిని కూడా బాగా రుద్దేసే వాళ్ళం, తరువాత మా అమ్మొచ్చి గానపెసూనాంబకి కొన్ని చీవాట్లేసి, కొబ్బరి పీచుతో కాకపోయినా, దానికి సరిసమానంగా బరకగా ఉండే సున్నిపిండితో మమ్ముల్నిద్దరిని తోమేసేది.

ఇలా మా గానపెసూనాంబ, మా పెద్ద దూడతో కాలక్షేపం చేస్తా ఉంటే, మా చిన్నక్కేమో కోళ్ళతో కాలక్షేపం చేసేది. పొద్దున్నే లేచి గంప కింద కోళ్ళని వదలటం, సాయంత్రం అయ్యేసరికి వాటన్నిటిని గంపకింద ముయ్యటం, అవి ఎక్కడెక్కడ గుడ్లు పెట్టాయో వెతుక్కుని తేవటం అన్ని తనే చేసేది. సాయంత్రం అయ్యిందంటే కోళ్ళ వెనకాల మా చిన్నక్క పరిగెట్టే చిత్రం చాలా పసందుగా ఉండేది. మా కళ్ళ ఎదుటే గుడ్లు, కోడి పిల్లలుగా అవటం చాలా అశ్చర్యంగా ఉండేది మా అక్కలకి. నాకు మాత్రం ఆడుకోటానికి కొత్త బొమ్మలు దొరికినట్లు సంతోషపడిపోయే దాన్ని. నాకు ఉహ తెలిసాక చేయలేదు కాని, అంతకు ముందు మాత్రం, కొడిపిల్లల్తో ఆడినంత సేపు ఆడి, తరువాత కొన్నిటిని తొక్కి, గొంతు పిసికేసేదాన్ని అని అమ్మ చెప్పేది. అందుకే అందరు నన్ను చిన్ని రాక్షసి అంటారు మరి. మా మవయ్య ఎప్పుడైనా మా ఇంటికి వస్తే, కోడిని కోసి మా అమ్మతో వండించుకునే వాడు. భోజనం ముందర కూర్చుని మా చిన్నక్క ఎందుకు ఏడ్చేదో మా కెవ్వరికి అర్థం అయ్యేది కాదు. చాల కోళ్ళు హతం అయ్యాక గాని చెప్పలేదు, తనకి, తన కోళ్ళని అలా కూరచేసేయటం బాధగా ఉందని. బాధతో తను చాలా ఏళ్ళు కోడి కూర ముట్టుకోలేదు.

మా అమ్మ వాకిలి చిమ్ముతూ, మా నాన్నరు గడ్డివాము దగ్గర, మా పని బుడ్డాడు గేదల దగ్గర, మా గానపెసూన దూడల దగ్గర, మా చిన్నక్క కోళ్ళ దగ్గర, పొద్దు పొద్దుటే పనిచేస్తూ ఉంటే, అరుగు మీద కూర్చుని వీళ్ళందరిని చూట్టం చాల బాగుండేది. పనులన్ని అయ్యాక, లోపలకెళ్ళి, పాలు, వెన్న, మీగడలు అమ్మకి తెలియకుండ నేను తింటా ఉంటే ఇంకా బాగుండేది. మా పెదనాన్నగారి బొత్తం నేను ఒకసారి మింగేస్తే, డాక్టరు రెండు రోజులు పచ్చి కోడుగుడ్డు తాగిస్తే అది విరోచనంలో జారిపోతుందని చెప్పారట. ఇక నేను ఎలాగు తాగుతున్నానని, ఇంట్లో గుడ్లు పుష్కలంగా ఉన్నాయని, మా అమ్మ, ఏకంగా ఏడదిపాటు నా చేత పచ్చిగుడ్డు తాగించేసింది. ఎంత అన్యాయమో కదా? దొంగచాటుగా తిన్న పాలు మీగడలే కాని, బలవంతంగా తాగిన పచ్చిగుడ్డ్లే కాని, నన్ను అడ్డంగా కాకుండా, నిలువుగా పెంచేసి, మా అమ్మ నన్ను, అడ్డ గాడిద అని కాకుండా, నిలువు గాడిద అని తిట్టేలా చేసాయి. అది నా విషాద గాధ ఐతే, మా చిన్నక్క పాలిట మా మావయ్య యమకింకరుడు. ఇక గానపెసూన దూడ చాలా ఏళ్ళే మా ఇంటిల్లిపాదికి పాలు ఇచ్చింది. జబ్బు చేస్తే దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే కంటతడి కూడా పెట్టుకుంది. ఆసుపత్రి నుంచి వచ్చి మా గానపెసూనాంబని చూస్తూ ప్రాణం విడిచింది. ఇక దానితో పాటే, మా ఇంట్లో పాడి అంతరించిపోయింది. అలాగే మా అనందాలకి కూడా గండిపడింది.

--విజయ