Saturday, January 16, 2010

కాలమా మారిపోకే మరీ అంతలా

ఒక చల్లని సాయంత్రం, ఎస్.పి.బాలుగారు పాడిన, 'కాలమిలా ఆగిపోని ' పాట వింటూవుంటే, నిజంగా ఆ నిముషానికి కాలం అలా ఆగిపోతే బాగుండు అనిపించింది. ఆ తరువాత నా దృష్టి అంతా కాలం మీదకి మళ్ళి పోయింది. ఎవరెంతగా కోరుకున్నా కాలం వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతునే ఉంటుందిగా. అదేంటో, ఈ మధ్య 'అవతార్ ' సినిమాలోని నీలి కోతులని చూసాక. బాబోయ్ కాలం అంత దూరం వెళ్ళకూడదు అనుకున్నాను. నిజం చెప్పొద్దూ, గ్రాఫిక్స్ మాట దేవుడెరుగు, ఆ సినిమాలోని, పాండోరా ప్రదేశం, ఆ నీలి కోతులు, దాన్ని కూడా జయించాలన్న మనిషి తపన ఇవేవి నాకు నచ్చలేదు.

నా స్నేహితురాలు అంటూ ఉంటుంది. కార్లు నడిపే రోజులు పోయి, వ్యక్తిగత పారాచూట్లు వచ్చేస్తాయి, ఆఫీసుకెళ్ళాలన్నా, బజారుకెళ్ళాలన్నా, రెక్కలు అతికించుకుని ఆకశ మార్గాన వేళ్ళే రోజు తొందర్లోనే వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు నేను ఆకాశంలో హెలో ఎక్కడికెళ్తున్నావ్ అని పలకరించుకుంటాం అని. ఈ మార్పు మాత్రం నాకెందుకో బాగానే నచ్చేసింది. తన ఆలోచన అలా ఉంటే, నేనెమో, భూ వనరులన్ని అయిపోయి, మళ్ళీ ఎడ్ల బండి ఎక్కి, 'బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి ' అని పాడుకుంటూ వేళ్ళాల్సి వస్తుందేమో అని అనుకుంటాను.

కాలాము సాగిపోయేదే, జీవితం సాగిపోయేదే, అయితే కాలం, గతాన్ని తవ్వుకోదు, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోదు. అవి రేండూ చేస్తూ, సాగే జీవనానికి ఆనకట్టలు వేసుకునేది మనమే కదా? అయినా, అవి రెండు లేకపోతే మనిషి మనుగడే లేదేమో. సో, గతాన్ని తవ్వుకోవాల్సిందే, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాల్సిందే. ఐతే, గతం మనల్ని తినేసేలా, భవిష్యత్తు మనల్ని భయపెట్టేదిగా ఉండకుండ ఉంటే చాలునేమో.

--విజయ


2 comments:

Anonymous said...

That is my philosophy too...

Future Rules | History Repeats :-)

-- Vinay Chaganti

శిశిర said...

"గతం మనల్ని తినేసేలా, భవిష్యత్తు మనల్ని భయపెట్టేదిగా ఉండకుండ ఉంటే చాలునేమో. "

అవును. బాగా చెప్పారు.