Tuesday, January 26, 2010

హసితం మధురం

నవ్వు నాలుగు విధాల చేటు ' అన్నారు కొందరు. 'నవ్వుతూ బ్రతకాలిరా ' అన్నారు కొందరు. 'నవ్వు నవ్వించు' అన్నారు కొందరు. ఎంతైనా హసితం మధురం. నాలుగు విధాల చేటు అనుకోకుండా, నవ్వుతూ బ్రతకటమే మంచిది అని నా అభిప్రాయం. ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని అడిగితే 'అధరం మధురం, హసితం మధురం, మధురాదిపతియే అఖిలం మధురం' అంటూ మధురంగా పాడేస్తుంది. నిజంగానే పరమాతం హసితం దేనికి సాటి రాదేమో.
పరంలో పరమాత్మ హసితం మధురమైతే, ఇహం లో, చిట్టి పాపాయిల బోసినవ్వుల తరువాతే ఎవరి నవ్వు గురించైనా మాట్లాడుకోవాలి.
పిల్లలు కాస్త పెద్దయ్యాక వారికి బాగా పరిచయమైన మధురమైన హసితం, బోసినవ్వుల గాంధీ దే కదా?
మా సీగానపెసూనాంబ ఈ మధ్య మనసారా నవ్వటం మానేసి, మూతి బిగించేసి నవ్వటం మొదలు పెట్టింది. అదేంటి అంటే, అనసారా నవ్వుకునేంత సంఘటనలు, వ్యక్తులు తనకి ఎదురవటం లేదన్నది తన ఉవాచ. ఇక నేను సంఘటనలు, మనుషులు ఎదురైనా అవకపోయినా, తెలుగు నటి సుహాసినిలా బలవంతంగా నవ్వేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో, మధురమైన హసితం గురించి చెప్పుకోవాలంటే, స్వర్గీయ వై.స్.ర్ దే చెప్పుకోవాలి. ఎన్ని నేరాలు, ఘోరాలు చేసినా, చెరగని దరహాసం ఆయన సొంతం. ఆయన కుమారుడు నవ్వితే మాత్రం ఎంతో కుతంత్రంగా ఉంటుంది. అధ్యాత్మిక గురువుల హసితం గురించి చెప్పాలంటే, ఓషో, రజనీష్ ల హసితాన్ని ఊహించుకోటానికి నేను కొంచెం కూడా సిద్దంగా లేను. చిన్న జీయర్ గారి హసితం పర్వాలేదనిపిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి హసితం నాకు మాత్రం మధురంగా అనిపిస్తుంది. ఆయన ప్రసంగాలెప్పుడు చిరునవ్వు చిందిస్తూనే చేస్తారు. ఇన్ని చెప్పాక, మొనాలిసా హసితం చెప్పకపోతే బాగోదు. మొనాలిసా గురించి ఎంత చదివినా, ఆ చిత్రంలోని అర్థం, ఆ నవ్వులోని అందం నాకు బోధపడవు. అందుకే నో కామెంట్స్.
నాకు బాగా నచ్చిన కొన్ని నవ్వు మొహాలు.
చివరిగా ప్రపంచం అంతటిని తన నవ్వు మొహంతో సదా పలకరించే ఒకే ఒక నవ్వు మొహం. కార్పోరేట్ రంగంలో, వ్యక్తిగత సంభాషణా, సమాచారాలలో, ఎంత చెత్త అయినా మాట్లాడి లేదా ఎంత చెత్త అయిన రాసేసి, చివరిగా దీన్ని పెట్టేస్తే అంతా కుశలమే.
చిరునవ్వే చిందించని వాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉంటారు. వాళ్ళకి, ఇంకా సంకుచితంగా నవ్వే వాళ్ళకి నా సంతాపం. ఎన్ని ఒత్తిడులు ఉన్నా మొహం మీద చిరునవ్వుని చెరగనీయకపోవటం నిజంగా ఒక కళ. అలాంటి వ్యక్తుల గురించి, వారి హసితం గురించి ఈ బ్లాగు ద్వారా నాతో పంచుకుంటే చాలా ఆనందం.
--విజయ

2 comments:

మానస సంచర said...

నవ్వడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అని అందుకే అన్నారేమో.

SHANKAR.S said...

:)