అప్పట్లో 'దిల్ వాలే దుల్ హనియ లే జాయేంగే' మూవి చూసి. అందులో షారుక్ ఖాన్, కాజోల్ ని పేరేంటో తెలుసుకోకుండా 'సెనోరీటా' అని పిలవటం ఎందుకో తెగ నచ్చేసింది. నచ్చటమే కాదు నన్ను ఎవరైనా అలా పిలుస్తే బాగుండు అనేసి కూడా అనుకునే దాన్ని. ఆ పదానికి అర్థం ఏమిటో కూడా తెలియదు అప్పుడు. అయినా పిలిపించుకోవాలని కోరిక. నాన్న ఎప్పుడు, చిన్నారి, చిన్నతల్లి అనిపిలుస్తారే కాని 'సెనోరీటా' అని పిలవొచ్చు కదా అనుకునే దాన్ని. అక్కలున్నారంటే, వాళ్ళ స్కూల్లో శంకరమ్మ అనే గయ్యాళి టీచర్ ఉండేది, ఆవిడ పేరుతో నన్ను చెల్లె శంకరమ్మ అని పిలిచేవారు కాని, నేను 'సెనోరీటా' అని పిలవమంటే మాత్రం పిలుస్తారా? అందుకే వాళ్ళకి చెప్పలేదు. ఇక అమ్మ ఉందంటే, ఒసేయ్ చిన్నదాన ఎక్కడున్నావ్ కూర్చుని చదువుకో అని చెప్పటమే తప్ప 'సెనోరీటా' అని ఎక్కడ పిలుస్తుంది? అబ్బ వీళ్ళెవరు అలా పిలవరని డిసైడ్ అయిపోయా.
ఆ సినిమా తెగ నచ్చి, ఒక సారి ఫ్రెండ్స్ తో చూసా, ఈ సారి అక్కలతో వెళ్ళిపోయా. టికెట్స్ కోసం క్యూలో నిలబడితే, ఒకతను వచ్చి మేడం ఒక టికెట్ కావాలి తీసివ్వండి అని అడిగాడు (మేము క్యూలో ముందు వున్నాం అని). ఇదే అదను అనుకుని, మేడం ఏంటి, నా పేరు 'సెనోరీటా' అని చెప్పా, అతను టికెట్ మోజులో సీనురీటా మేడం, సీనురీటా మేడం, ఒక్కటంటే ఒక్కటి టికెట్ తీసివ్వండి అన్నాడు. అబ్బా చంపావు కదరా అనుకున్నాను. సినిమా అయిపోయాక ఆటోలో ఇంటికి వెళ్తున్నప్పుడు, ఆటో అతనికి పనిగట్టుకుని మరీ నా పేరు 'సెనోరీటా' తెలుసునా అని చెప్పాను. అతను ముసి ముసిగా నవ్వి ఊరుకున్నాడు. అల్లంత దూరాన ఇల్లుందనగానే సెంటర్లో మమ్మల్ని దింపేసాడు ఆటో అతను. మేము డబ్బులివ్వటం మర్చిపోయి ఆటో దిగి వచ్చేస్తున్నాం. సడెన్ గా అతనికి నా పేరేంటో గుర్తు రాలేదు. వచ్చాక, ఓ 'పాలరీటా మేడం' నా డబ్బు ఇచ్చి వెళ్ళండి అని వెనకాల పరిగెత్తుకు వచ్చాడు. చచ్చానురా దేవుడా అనుకున్నాను.
అసలు సెనోరీటా అనే పదం స్పానిష్ పదమట, అమ్మాయిలని మిస్ అని పిలవటానికి స్పానిష్ లో సెనోరీటా అని పిలుస్తారట. నేనా మధ్య పని మీద మెక్సికో వెళ్ళటం జరిగింది. నేను మిస్ కాకపోయినా, ఎవరైనా ఎవరినన్నా సెనోరీటా అని పిలుస్తారేమో విందామని ఎదురు చూస్తూ ఉన్నాను. కాని ఎవ్వరు ఎవ్వరిని అలా పిలవ లేదు. బహుశ స్కాట్ లాండ్లో స్పానిష్ వాళ్ళు అలా పిలుస్తారెమో, మెక్సికో స్పానిష్ వాళ్ళు అలా పిలుచుకోరేమో అని అనుకున్నాను. పైగా నా టాక్సి డ్రైవర్, మేడం, మీ ఇండియాలో, పాము, కోతి, పంది, ఎలుక, ఆవు, ఏనుగు, ఇలాంటి జంతువులన్నిటిని దేవుడని పూజిస్తూ ఉంటారటగా అని ఎంతో అశ్చర్యంగా అడిగాడు. అతను అడిగిన దానికి కొంచెం కోపం వచ్చినా, ధీటైన సమాధానాలు నా దగ్గర ఉన్నా 'సెనోరీటా' మీద అభిమానంతో అతనితో వాగ్విదానికి దిగకుండా, ఓ నవ్వు నవ్వి, టాక్సి దిగి వచ్చేసాను. అది అప్పట్లో, ఇక ఇప్పుడు, 'సెనోరీటా' ని నాకు ఆపాదించుకునే స్థితిలో నేను లేను.
--విజయ