మొన్న శివరాత్రికి రాజమండ్రి చూడ్డానికి వెళ్ళాను, కొనసీమ అందాలు ఇప్పటికే అందరు వర్ణించి వున్నారు, నా కళ్ళతో కూడా ఒకసారి మీ అందరికి చూపిద్దామని, కడియపులంక పూల అందాలని ఆస్వాదిస్తూ ర్యాలి, దిండి రిసార్ట్స్ చూస్తు గోదావరి సముద్రుడిలో కలిసే అంతర్వేది వరకు వెళ్ళాను.
ఎటు చూసినా పచ్చదనమే, దూరంగాను దగ్గరగాను కనిపించే కొబ్బరి చెట్లు గోదారి లోని నీళ్ళన్ని తమ బోండాలలో నింపుకుని గర్వంగా తలలెత్తి పలకరిస్తూ వుంటాయి, ఇంక పంట పొలాలు చూస్తుంటే ప్రకృతి మాత తన అందాల బిడ్డని ఎత్తుకుని చిలకపచ్చ చీర కట్టి ఆతిధ్యానికి ఆహ్వానిస్తు మర్యాదలు చేసే కొనసీమ ఇల్లాలిలా అనిపించింది. చల్లని గాలి వింజామర ఐతే కొసరి కొసరి పనసపొట్టు కూరతో వడ్డించిన రాజోలు హోటల్ లోని భోజనాన్ని, ఆ వడ్డించిన వ్యక్తిని, ఇక్కడ రెస్టారెంట్స్ లో వేల కొద్ది బిల్ కట్టినా ఆ ఆతిద్యం ఆ రుచులు దొరుకుతాయా.
ఎంతైనా గోదావరి జిల్లాల వాళ్ళు చాలా మర్యాదస్తులు, వారి మర్యాద మనకి నేర్చుకుందామన్నా రాదు, మనిషిని గౌరవించడం లో వారికి వారే సాటి, మాటల్లో కొంత వెటకారమున్నా, మనుషులని ఆదరించడం వారికి బాగా తెలుసు.ఇక పాపికొండల నడుమ గోదారి అందాలు ఏమని వర్ణించగలంలే,నేను కృష్ణ శాస్త్రిని కానుగా , పాపికొండల నడుమ గోదారి హొయలు పదహరేళ్ళ పడుచుపిల్ల నడుము తిప్పుకుంటు చంకలో కడవతో నడిచిపోతునట్లు వుంటాయి, పచ్చని కొండలన్ని అమ్మాయి ఆకుపచ్చ లంగా వేసుకుని, గోదారి నీళ్ళేమో నీలిరంగు ఓణి లాగ తెల్లని మబ్బులు తెల్లని రవిక లాగ అద్బుతంగా గోదారి కన్యక చంకలో కడవెత్తుకుని కొనసీమ ప్రజల దాహార్తిని తీర్చడానికి వెళ్తున్నట్లు అనిపించింది.
ఇంత అందమైన ప్రక్రుతి లేకపొతే కవులకి కవిత్వం ఎలా వస్తుంది, అందుకేనేమో వంశీ గోదారి లేందే సినెమా తీయలేదు, విశ్వనాధుడు ఒక స్వాతి ముత్యం లాంటి అద్బుత కళా ఖండాన్ని తీయగలిగాడంటే గోదారి వుంది కనకే అని నాకనిపించింది.
ఒకసారి వెళ్ళేరంటె మీక్కూడా అనిపిస్తుంది.
భారతి
2 comments:
మీరు మరీ అంతలా పొగిడెయ్యకండీ మాకు సిగ్గేస్తుంది.( ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి కాలం కలిసొస్తే ఇక్కడే రాలిపోయేదాన్ని. కాబట్టి నేనే గోదావరి...గోదావరే నేను )
భారతి గారు, చూశారా మా కోనసీమ ఎంత బాగుంటుందో. మేమైతే రోజూ చూస్తాం మరి. :)
బాగా వర్ణించారండి కోనసీమని.
Post a Comment