
స్టార్ నైట్ నేను ప్రత్యక్షంగా చూడక పోయినా, తారలు దిగి వస్తే ఎలా ఉటుందో చూడాలన్న కుతుహలం కొద్ది, ఎన్నో కోసుల దూరాన ఉండి, ఇంటర్నెట్లో చూసాను. నిజంగానే తారలు దిగివస్తే భలే తళుకు బెళుకులు. వయసు మీద పడుతున్నా అందం తరగని కథానాయికలు. మేకప్ లేకపోతే ఇలా ఉంటారా అని అవాక్కు చేసే కథానాయకులు. కామెడీతో అదరగొట్టిన కామెడియన్లు. గళమెత్తిన బాలు, సుశీలలు. డాన్సులతో హోరెత్తించిన కుర్ర తారాగణం. అందరికి హుషారు తెప్పించిన దేవిశ్రీ. మొత్తం మీద సామాజిక అవసరార్ధమై అందరూ నడుము బిగించిన తీరు అభినందనీయం. ఇంతవరకే తెర ముందు కనపడుతుంది. తెర వెనక చాలా ఉంటుంది.
ముందుగానే వరద బాధితులకి విరాళాలు ఇచ్చి కూడా మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తారలు ఎంతో మంది. విరాళాలు ఇవ్వని తారలు, షూటింగ్ పేరుతో కార్యక్రమానికి హాజరు అవ్వని తారలు కూడ ఉండి ఉండవచ్చు. కాని ఇందులో మంచి కోణమె చుద్దాంలె అనుకుంటే, నా ఆలోచన అంతా చూడటానికి వచ్చిన ప్రేక్షకుల గురించే. ఉదారంగా విరాళం ఇవ్వటానికి మనసొప్పని వాళ్ళు ఎంత మంది తారల మోజులో డబ్బు పెట్టి టికెట్ కొని, రద్దీ రోడ్ల మీద గంట సేపు వాహనం నడుపుకుంటూ స్టేడియం చేరుకుని ఉంటారు ఆ తారా విభావరి కోసమై? అదీ తారలంటే మన ప్రజలకి ఉన్న మోజు. ఊరికే ఇవ్వరా బాబూ అంటే, ఎవరు ఇవ్వరు, అదే మోజు మీద బాణం వేసి ఇలా డబ్బు పోగేయటం, చాలా సుళువు. ఒక రకంగా మంచిదే, కాని ప్రేక్షకుడిది గొర్రె పాత్రలా అనిపిస్తుంది నాకు.
అంతటి కార్యక్రమాన్ని కార్యచరణలో పెట్టాటానికి, నిర్వహకులు చాలానే కష్టపడి ఉంటారు. లేటుగా హాజరైన కొందరు ప్రముఖులకి భంగపాటు ఎదురైందని వినికిడి. ఆ తరువాత నిర్వాహకులు సారీ చెప్పి మరీ సీట్లు కేటాయించారట. ఇది ఏమైనా నిర్వాహుకుల కూతురి పెళ్ళా ఆహూతులని ఆహ్వానించి కూర్చో పెట్టటానికి? అయినా అలానే కూర్చో పెడతారు. అదీ మన దేశంలో డబ్బుకి, పదవికి ఉన్న పవర్. అందుకే అందరూ పదవో రామచంద్రా అంటూ పదవులకి, డబ్బుకి, హోదాకి అర్రులు చాస్తారు. అంతే గాని, ఇంత చిన్న అసౌకర్యాన్నే భరించలేక పోతున్నాము, అంతటి భారీ వరదల్ని ప్రజలు ఏలా తట్టుకోగలిగారా అన్న ఆలోచన, సారీ చెప్పించుకున్న ఒక్క నాయకుడికి కూడా తట్టిఉండక పోవచ్చు. మన ప్రజలలో వున్న వెర్రి తనం అర్థం కానట్లే, మన నాయకుల్లో, ఇంకా ప్రముఖ వ్యక్తులుగా వ్యవహరించే వాళ్ళలో, ఎవరికి వారు మేమే గొప్ప అనే భావంతో కనిపించే వాళ్ళలో ఉన్న బ్యూరోక్రసి నాకు అర్థం కాదు.
ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పక తప్పదు. ఎవరి గురించి అంటే, ఇలాంటి సామాజిక, ప్రజా కార్యక్రమాలలో, మహిళా తారామణులని పబ్లిక్ ప్రాపర్టీగా చూసి, పిచ్చి చేష్టలు చేసే వెర్రి జనాల గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది. అయినా యధా రాజ, తధా ప్రజ. మొత్తానికి, విరాళాలు మధ్యలో నొక్కకుండా, అందాల్సిన వాళ్ళకి అందజేస్తే అదే పదివేలు.