Friday, February 12, 2010

ప్రేమికుల రోజు మీ పిల్లల్ని శాంతి ప్రేమికులని చేయండి ఇలా

మా గానపెసూన, మూడేళ్ళ వాళ్ళ చుట్టాలబ్బాయి గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఈ తెలంగాణ గొడవలు, బస్సులు తగలెయ్యటాలు అవి టీ.వి లో చూసి, ఆ బుడతడు, పెద్దయ్యాక నేను కూడా బస్సు మీద బాంబు వేస్తాను తాతా అన్నాడట వాళ్ళ తాతయ్యతో. ఆయనకి ఎమనిపించిందో కాని, మా గానపెసూన ఆ మాట చెప్తుంటే, నా తలపై బాంబు పడినట్లనిపించింది నాకు. అలాగే పక్కింటి పిల్లవాడు ఎక్కడ నేర్చుకొస్తున్నాడో గాని భయం లేకుండా బూతు మాటలు మాట్లేడుస్తున్నాడని కూడా చెప్పింది. చుట్టూ జరిగే వాటికి పిల్లలు ఎలా బలైపోతారో, వాళ్ళ మానసిక పరిస్థితి ఏ రకంగా తయారవుతుందో ఇంతకన్నా ఉదాహరణలు ఏమి కావాలి ?

ఇక సినిమా విషయానికి వస్తే, పిల్లలు ఫేవరేట్ హీరోలని చూసి ఎవేవి నేర్చుకోకూడదో అవన్నీ నేర్చేసుకుంటున్నారు. పరుగు సినిమాలో అనుకుంటా, అల్లు అర్జున్, 'అవును అలాగే అంటాను, అయితే ఏంటి తొక్కా??' అని పెద్దవాళ్ళని చాలా అమర్యాదగా మట్లాడుతాడు. అదే మాటని, నేను పది సవంత్సరాల పిల్లవాడి నోటినుంచి విన్నాను. ఏంటి అలా అంటున్నావంటే, అల్లు అర్జున్ అలాగే అంటాడు అని చెప్తే విని ఆశ్చర్యపోవటం నా వంతు అయ్యింది. దాదాపు అన్నీ సినిమాలలో, పిల్లల ఫేవరెట్ హీరోలు నెగటివ్ షేడ్స్ చూపిస్తున్నారు. హీరోలంతా, మందు తాగటం కోసం అర్రులు చాచటం, తాగేసి సొలుగుతూ మాట్లాడటం, ఆ తరువాత బాటిల్స్ పగుల గొట్టటం ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది. అశ్లీలత గురించి అయితే ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు. వీటన్నిటిని ఆపే శక్తి ఎవరికి లేదు. మంచికన్నా, చెడుని త్వరగా వొంటబట్టించుకునే పిల్లలకి వీటన్నిటిని విశదీకరించి, పాలు-నీళ్ళు వేరు చేసి చూపించాల్సిన భాద్యత మనదే. ఒకరకంగా చెప్పాలంటే, ఇంగ్లీషు మూవీస్,కార్టూన్స్ చూసి నేర్చుకునే దానికన్నా, తెలుగు సినెమాలు చూసి, రవితేజ ఎంత వెటకారంగా మట్లాడాడు, అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ మాట వినకుండా ఎలా తప్పించుకున్నాడు, సిధార్థ్, తాగేసి ఎలా మాట్లాడాడు ఇవే ఇమిటేట్ చేస్తున్నారు పిల్లలు. మా గానాపెసున చెప్పిన బుడతడైతే ఏకంగా రాజకీయ నాయకులనే ఫాలో అవుతున్నాడు. పిల్లవాడికి ఆట బొమ్మగా గన్ కొనిపెట్టటం కూడా ఈ రోజుల్లో తప్పుగా కనిపిస్తోంది. వెనకటి రోజుల్లో ఐతే పోలిస్ ఆఫిసరులా ఆడేవాడు. ఇప్పుడైతే 'ధూం' సినిమాలో హృతిక్ లాగానో, 'సూపర్ ' సినిమలో నాగార్జున లాగానో, హైటెక్ దొంగాటలే ఆడుతున్నారు. లేదంటే, 'పోకిరి ' సినిమాలో లాగా మాస్ కిల్లింగ్ ఆట. ఇంక పిల్లలు మాఫియా ఆటలు ఆడటం చూడటం ఒక్కటే మిగిలి ఉంది.

ప్రపంచానికి, శాంతి అంటే ఎమిటో కూడ తెలియని రోజుల్లోనే, శాంతిని, అహింసని వంటబట్టించుకున్న మనం, ఇప్పుడు వాటి ప్రముఖ్యాన్ని పిల్లలకి పదే పదే గుర్తు చెయాల్సిన స్థితిలో వున్నాము. చుట్టూ వల పన్నేసి ఉన్నట్లుగా ఉన్న ఈ మీడియా నుంచి, వాళ్ళ మైండ్ సెట్ అంతా తప్పించి, వాళ్ళని శాంతి ప్రేమికులుగా మార్చటం కష్టతరమైన పనే. కాని చిన్న ప్రయత్నం చేద్దాం.

1) పిల్లల నోటి నుంచి ఒక్క మాట తేడాగా వచ్చినా, వాళ్ళ చేతల్లో చిన్న తేడా కనిపించినా, మొగ్గలోనే దాన్ని ఖండించటం ఎంతైనా అవసరం. మళ్ళీ ఆ మాట మాట్లాడలన్నా, ఆ చేత చేయాలన్నా వాళ్ళు అలోచించుకోవాల్సిన స్థితిలో ఉండాలి.
2) సినిమాకి, నిజ జీవితానికి తేడా స్పష్టంగా తెలియజేయాలి.
3) ఈ ప్రేమికుల దినోత్సవం సంధర్భంగా శాంతి పావురం కలరింగ్ కాగితం ఒకటి డౌన్లోడ్ చేసి లేదా ఇక్కడ నేను అప్లోడ్ చేసిన బొమ్మ మీద క్లిచ్క్ చేసి ప్రింట్ తీసుకున్నా సరే, మంచి రంగులతో పిల్లల్ని దాన్ని నింపమని, దాన్ని ఇంట్లో అతికించితే వాళ్ళకి దాని అర్థం తెలియజేస్తే చాలా బాగుంటుంది.
4) మీకు పెయింటింగ్ చేయటం వస్తే, చిన్నవాడి లేదా చిన్నదాని టి-షర్ట్ మీద మంచి శాంతి పావురాన్ని పెయింట్ చేసి, వాలెంటైన్స్ డే రోజు తొడిగేస్తే సరి. ఇక ఆ రోజంతా తోటి పిల్లల్తో ఆ చొక్కా గురించి, దాని మీద ఉన్న పీస్ సింబల్ గురించే మాట్లాడుతారు.
5) ఇంట్లో పెంపుడు జంతువులని చూసుకునే ఓపికా తీరికా ఉంటే, ఆఇంట్లో పిల్లలకి సాటి ప్రాణుల పట్ల ఎంతో ప్రేమని పెంచినట్లే.
6) ఐకమత్యము, ఆదరణ, శాంతియుత సహజీవనం పిల్లలకి తెలిపి వాళ్ళలోని కటినత్వాన్ని, బిరుసుతనాన్ని, అమర్యాదని తగ్గించే ప్రయత్నం చేద్దాం.

--విజయ

1 comment:

Unknown said...

మంచి విషయం చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లల గురించి ఆలోచిస్తే నా కయితే చాలా భయం వేస్తుంది.వీలైనప్పుడల్లా పిల్లలికి సంబందించినవి వ్రస్తూఉండండి.

సుధ