Saturday, November 7, 2009

కంచీవరం - ప్రకాష్ రాజ్ మూవీ


తారె జమీన్ పర్ లాంటి చిత్రాన్ని కాదని, బిగ్ ఖాన్స్ ని తోసిపుచ్చి, ప్రకాష్ రాజ్ కి జాతీయ పురస్కారం వచ్చిందని గాని, స్వతహాగా ఆర్ట్ చిత్రాల పట్ల ఉన్న అభిమానంతో గాని, జీవితాల్ని దృశ్య కావ్యంగా చూడాలనే కుతుహలంతో గాని ఈ చిత్రం చూడటం జరిగింది. చాల రోజులకి కమర్షియల్ సక్సెస్ కోసం చూడకుండా ఒక మంచి చిత్రాన్ని తీసారనిపించింది. తమిళ చిత్రం కావటంతో, సబ్ టైటిల్స్ పెట్టుకుని చుడాల్సి రావటంతో,చిన్నప్పుడు మా కుటుంబం అంతా కూర్చుని, దూరదర్శన్ లో ప్రాంతీయ భాషా అవార్డు సినెమాలు చూసిన ఙాపకం స్మృతిపదం లో మెదిలి భలే ఆనందం కలిగింది.
కంచీవరంలో నేసిన కంచి పట్టు చీర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎవరెవరికో ఎన్నో పట్టు చీరలు నేసే హీరో (పేరు వంగడం),అందునా మగువ మనసు తెలిసిన హీరో, భార్యకి పట్టు చీర నేయాలనుకుంటాడు. ఆ కోరిక తీర్చక ముందే భార్య చనిపోతుంది. కనీసం కుతురు తామరకైనా పట్టు చీర నేసి పెళ్ళి చేయాలనుకుంటాడు. దాని కోసమై ఎంతో కష్టపడతాడు, మనిషిగా దిగజారి, ద్రోహిగా కూడా ముద్ర వేయించుకుంటాడు, ఐనా అతని కల నిజమవని ఒక విషాద గాధ ఈ కంచీవరం. చిత్రంలొ ఎన్ని పాత్రలు ఉన్నా, చిత్రం ఆసాంతం తన భుజాల పైన ఎంతో సహజంగా నడిపిస్తాడు కథానాయకుడు అందుకే ఆ పురస్కారం.

కథ పరంగా చూస్తే ఇంతే ఉంటుంది. కాని దృశ్య పరంగా, నటన పరంగా, స్వాతంత్ర్యం తదనంతరపు చిత్ర సన్నివేశాల పరంగా,ఈ చిత్రం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఒక నేతగాని పనితనానికి అబ్బురపడకుండా ఉండలేము. పట్టు చీర లేకపోయినా, మాములు నేత చీర కట్టుకుని, తలలో మల్లెలతో గుభాళించే మగువలు చూడ ముచ్చటగా అనిపిస్తారు. నేతగాళ్ళలో కమ్యూనిష్ట్ కార్మిక ఉద్యమం ఎలా మొదలైందో చూపించటం బాగుంటుంది.

అంతా చూసాక అర్థం అయ్యే విషయం ఒకటే, స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సవంత్సరాలు ఐనా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని పథకాలు చేపట్టినా, ఎన్ని కో-ఆపరేటివ్ సొసైటీలు పెట్టినా, నేతగాని జీవితంలో, ఆ మాటకొస్తే, సామన్యుని జీవితంలోనే, అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదని.

3 comments:

కొత్త పాళీ said...

Nice review

kumarvarma said...

సినిమా రివ్యూ చాలా లైవ్లీగా రాసారు. ఆడవారికే ఇలా రాయడం చేతనౌనేమో అనిపించింది. చివర్లో మీ చురకలు బాగా వున్నాయి. 60 సం.లు దాటినా స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందుబాటులో లేవనే విషయాన్నిని బాగా చెప్పారు. ధన్యవాదాలు. ఇలాగే రాస్తూండండి.

Kathi Mahesh Kumar said...

చాలో లోతైన ఆలోచనా,విమర్శా ఉన్నచిత్రం ఇది.(ఈ మధ్యకాలంలో కొన్ని హిందీ చిత్రాలు చూసిన తరువాత) నిజంగా ప్రియదర్శన్ చేశాడనే నమ్మకమే కలగదు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రకాష్ రాజ్.