మా అక్క చిన్నప్పుడు పాటలన్నా, డాన్సులన్నా తెగ ముచ్చట పడిపోతూ అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి కూడా చేసి చూపించేస్తా ఉండేది. ఎవరైనా అడిగిందే తడువు, టవల్ ఒకదాన్ని పమిట లాగ వేసుకుని, జుమ్మంది నాదం అంటూ ఆ గదిలోకి, ఈ గదిలోకి తూనిగలాగా తిరిగేసేది. తిరగటమే కాదు, నాకు, మా చిన్నక్కకి డాన్సు చేయటం బొత్తిగా తెలియదనుకుని చాలా గర్వపడుతూ ఉండేది. పాపం మా ఇంకో అక్కకి నేర్చుకో పోయినా డాన్సు చేయటం బాగానే వచ్చు, కానీ అది ప్రూవ్ చేసుకునే చాన్సు, మా సీగానప్రసూనాంబ ఇస్తేగా? డాన్సు మాత్రమే కాదు, మా ప్రసూనాంబ గాత్రంలో కూడా ఫస్ట్. అడిగినదే తడవుగా, 'రేపంటి వెలుగే కంటి... పూవంటి దొరనే కంటి ' అని ఎత్తుకునేది. లేదంటే మళ్ళీ 'జుమ్మంది నాదం అంటూ ' మొదలెట్టేది.
ఇవన్నీ ఒక ఎత్తైతే, పొద్దుటే మా నాన్న పక్కన చేరి, రేడియో లో ఇట్టా గోట్టి(ఇష్టా గోష్టి), చచ్చా వేదిక (చర్చా వేదిక)వినేస్తూ తను పెద్ద దాన్ని అయిపోయాను అనుకునేది మా వైపు ఒక పిచ్చి చూపు చూస్తు. మళ్ళీ మధ్యాహ్నం మాతో పాటు 'బాలానందం ' వినటానికి మెల్లిగా మా పక్కన చేరేది. మేమేమి తక్కువ కాదు, మా పక్కన చేరనిచ్చే వాళ్ళం కాదు. వెళ్ళి మా అమ్మ పక్కన చేరి, మా అమ్మ బూర్లో, గార్లో చేస్తుంటే సాయం చేస్తా అంటూ తన ప్రతిభా పాటవాలని అక్కడ ప్రదర్శించుకునేది. అమ్మ బూర్లు ప్లేట్లో పట్టుకుని వస్తూంటే, పక్క న నిలబడి అవి తనే చేసినట్లు ఫోస్ పెట్టి మరీ నిల్చునేది.
ఎప్పుడైనా మా అమ్మ మమ్మల్ని వదిలి, పక్కింటావిడతో సినిమాకి వెళ్తే, తను వచ్చేసరికి, మార్కులు కొట్టేయటానికి, సన్నజాజులన్నీ తెంపి, సూది దారంతో చెండులుగా చేసి, మా మొహాలు కడిగి, మా ఇద్దరికి కళ్ళ నిండా కాటుక పులుమి, చందమామ అంత బొట్టు పెట్టి, మల్లె చెండులు మా తల్లో పెట్టి, మా అమ్మ వచ్చేసరికి, అరుగు మీద గొబ్బెమ్మల్లా మమ్ముల్ని కూర్చోపెట్టేది. మా అమ్మ మమ్ముల్ని చూసి దడుచుకుని, మా మొహాలు మళ్ళీ కడిగేది.
చెప్పొద్దూ, మేము ఆడుకుంటా ఉంటే, తనేమొ ఏదో పువ్వు గీస్తునో, కొమ్మ గీస్తూనో పికాసో లా ఫోసు కొట్టేది. ఇంతలో మా పిచిగ్గూడూ రెడీ అయ్యిందని అబ్బురంగా చూస్తూ ఉండగానే, సుడిగాలిలా వచ్చి దాన్ని నేల మట్టం చేసి మళ్ళీ వెళ్ళి బొమ్మలు గీసుకుంటూ కూర్చునేది. తను గీసిన పిచ్చి గీతలన్ని ఇంటి నిండా అతింకించేది అఖరికి మా పుస్తకాల అరలో కూడా.
గానప్రసూనాంబ అంటే ప్రతి దీపావళికి నెల రోజుల ముందే ఏడ్చి టపాసులు కొనిపించుకుని, వాటిని నెల రోజుల పాటు ఏండలో ప్రతి రోజు పెట్టి, చివరికి వానలో తడిపి, పండుగ రోజునాటికి టపాసులు తుస్సుమనేల చేసే వాళ్ళే అని మా చిన్నక్క చెప్పేది.
నాకు అంతటి అదృష్టం కలగలేదు కాని, మా చిన్నక్కకి అన్నీ మా సీగానప్రసూనాంబ వాడిన వస్తువులే. అవి మా చిన్నక్కకి ఇస్తూ సర్లే వాడుకో అన్నట్లు ఒక చూపు విసిరేది. పాపం మా చిన్నక్కకి గానప్రసూనాంబ చూపు అర్థం కూడా తెలిసేది కాదు. మా చిన్నక్క చాలా సార్లు బలైపోయేది కాని. నేను కొంచెం తెలివిగా తప్పించుకునేదాన్ని. అందుకని, నా సంగతి నేను నిద్రలో ఉండగా నన్ను గిచ్చో, గిల్లో చూసుకునేది. ఎలాగొలా తన పనులన్నీమాతోనే పూర్తీ చేపించుకునేది. అమ్మ వచ్చే సరికి అన్నీ తనే చేసినట్లు చెప్పుకునేది.
పెద్దయ్యాక కొన్ని చేష్టలు తెరమరుగైనా, తన గానం, గాత్రం వంటి ఇష్టాలు ఇంకా పోలేదని, తను 'రెడీ ' సినిమాలోని 'ఓం నమస్తే బోలో బేబీ' పాట పాడే వరకు నాకు అర్థం కాలేదు. అందుకే తను ఇప్పటికీ కూడా సీగానప్రసూనాంబె.
--విజయ
10 comments:
Vijayasri, mee akka ante siganaprasoonamba chilipi chestalu navvu teppinchela vunnayi. peddayyamane feelingtho konni alavaatlu maarchukunna poorthiga aalochanalanu maarchukolemu kadaa!
చాలా బాగున్నాయండి మీ అక్కయ్య కబురులు. ముఖ్యంగా మిమ్మల్ని తయారుచేసి కూచోపెట్టిన విధానం, ఝుమ్మంది నాదం డాన్స్ నాకు చాలా బాగా నచ్చాయి.
మీ రాత శైలి అద్భుతం..సీగానపసూనాంబ చిన్నతనంలొ పెద్దరికపు చేష్టలు వివరించిన తీరు అమోఘం..మొత్తానికి మీ రచన జీవితపు తొలి రోజుల సరదాల పరదాలు తొలగించింది...మనసారా ఆ కాలానికి తీసుకెళ్ళింది ....
వో మా అక్కలాంటి రాచ్చసులు అదే అదే సీ గాన పసూనాంబ లు ఇంకా వుంటారన్నమాట.. హి హి .. బాగుందండి..
@ నిర్మల: ఏ వయసు అయినా, మనలోని చిలిపితనం, చిన్నపిల్లల మనస్థత్వం పోగొట్టుకోకుండా ఉంటేనే జీవతంలో అనందం మిగిలుంటుంది.
@ భావన: ఎందుకుండరు, సీగానపసూనంబలు, మీ లాగ వంట చేసేవాళ్ళు, నా లాగ, మీ అన్నయ్యలాగ ఎడిపించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. :-)
@ జయ: తన గానం, గాత్రం ఇంకెవరికైనా నేర్పాలని కూడ ఉంటుంది సీగానప్రసూనంబకి. ఎవరు బలౌతారో తెలియదు మరి.
అరుగు మీద గొబ్బెమ్మల్లా
చాలా మంచి పద ప్రయోగం.
మేమిద్దరం. ఒకరు నరసింహ , రెండవవారు వేదులవారు. వేదుల వారి బ్లాగులోనివన్నీ వారి స్వీయరచనలు. వాటికి నేను లేఖకుడను మాత్రమే . మిగిలిన బ్లాగులను నిర్వహిస్తున్నది నరసింహ అంటే నేను. వేదుల వారు చాలా పెద్దవారు. కంప్యూటరులో వ్రాయటాన్ని చేయలేరు. వారి తరఫున నేను వారి రచనలను పోస్టు చేస్తంటాను. కాని మేమిద్దరం మా అన్ని బ్లాగులకు ఉమ్మడి హక్కుదార్లమన్నమాట . అందుచేత కొంచెం వివరణ.
"గాన"ప్రసూన .. బహు బాగు.
అభినందనలు. బొమ్మకూడా భలే సరిపోయింది.
బాగుందండి..
బాగుందండి..
Post a Comment