Thursday, May 20, 2010

గాన పెసూన - వాహన చోదకం

మా గానపెసూన చిన్నతనంలో, తల్లితండ్రులు పిల్లల్ని ఫోటో స్టూడియోకి తీసుకేళ్ళి కీలు గుర్రం ఎక్కించ్చి ఫోటోలు తీపించేవారు. ఎవరి ఇళ్ళల్లో చూసినా పిల్లో, పిల్లవాడో కీలు గుర్రం మీద ఎక్కిన ఫోటో తప్పనిసరిగా ఉండేది. అలాగే మా ఇంట్లో మా గానపెసూన కీలు గుర్రం ఎక్కిన ఫోటో ఉండేది. ఎందుకో తెలియదు కాని మా నాన్నారు నన్ను, మా చిన్నక్కని కీలు గుర్రం ఎక్కించి ఫోటో తీపించలేదు. కీలు గుర్రం ఫోటోలంటే బోర్ కొట్టేసి అలా మమ్మల్ని ఫోటో తీయనందుకు నేను, మా చిన్నక్క తెగ సంతోషపడుతూంటే, మా గానపెసూన మాత్రం కీలు గుర్రం ఎక్కిన రాకుమారిలా తెగ ఆనందపడిపోయేది. మా ఇద్దరికేమో దుబ్బు లాంటి జుట్టు వేసుకుని, పెద్ద కళ్ళు పెట్టుకుని, పళ్ళు బిగబెట్టేసి, కీలు గుర్రం ఎక్కిన రాకాసిలా కనిపించేది. అలా కీలు గుర్రంతో మొదలైన గానపెసూన వాహన చోదకం ఇప్పటివరకు ఎలా కొనసాగుతోందో తెలియచెప్పాల్సిందే.

గానపెసూనని, చిన్నప్పుడంతా దూరం నడవలేదని, మంచి బడిలో వేయకుండా ఇంటి పక్కనే ఉన్న తురక మాస్టారు కాని బడిలో వేసారు మా నాన్నారు. తనే తురక మాస్టారుకి తెలుగు పాటలు చెప్పేసి వచ్చేది. తను వచ్చే వరకు నేను, మా చిన్నక్క బడి బయటే ఆడుకుంటూ ఒక్కోసారి గడ్డి పీకుతూ కూర్చునే వాళ్ళం. ఆ బడి ఎంతసేపు ఉండేది కాదు. అలా చిన్నప్పుడు మా గానపెసూన చదువుని అటక ఎక్కించారు మా నాన్నరు. ఆ తప్పు మళ్ళీ మా ఇద్దరిపట్ల చేయలేదు. వాహన చోదకం చేయకుండానే పదవ తరగతికి వచ్చేసింది. అప్పుడు నేను, మా చిన్నక్క 7వ తరగతి చదువుతున్నాం (నాకు తెలివి ఎక్కువ అయిపోయిందని గోల చేసి 6 చదవకుండానే 7 లోకి ప్రమోట్ చేపించుకున్నాను). మా చిన్నక్క నేను, మా నాన్నారి సైకిలుని తెగ తిప్పేసే వాళ్ళం. మా చిన్నక్క ఓ అడుగు ముందుకేసి, ఎవరు పెద్దగా నేర్పక పోయిన, తానే లూనా బండి నడపటం నేర్చేసుకుంది. తను నడపటం చూసి, గానపెసూన కూడా, ఒక రోజు లూనా పట్టుకుని బయలుదేరింది. అలా పట్టుకేళ్ళిందో లేదో ఇలా ఒక తురక పాదచారికి గుద్దేసింది. ఆయన, 'అల్లా దయతోని ఇవాళ నేను బతికిన, నాకు రేండు ఆడ పిల్లలున్నయ్, అన్యాయం జరుగుతుండే, దయవుంచి ఇంకెప్పుడు బండి నడపకు బేటీ " అని గానపెసూనని ప్రార్దించి మరీ వేళ్ళాడు. అతని ప్రార్థన మాహాత్యమో, లేక భయమే కలిగిందో, కొన్ని ఏళ్ళ వరకు గానపెసూన బండి మొహమే చూళ్ళేదు. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నా కూడా పోలో మంటూ సిటీ బస్సులోనే వెళ్ళేది కాని ద్విచక్ర వాహనం నడిపే సాహసం ఎవరు ఎన్ని చెప్పినా చేయలేదు.
నేను అమెరికా వచ్చి కార్ కొనుక్కున్నాక, అప్పుడు కొంచెం చలనం కలిగి. ద్విచక్ర వాహనాన్ని దూరంగా పెట్టి, చతుచక్ర వాహనాన్ని నడపటానికి సిద్దపడి ఏనుగు లాంటి సెకండ్ హాండ్ మాటీజ్ లో ఎక్కి కూర్చుంది. దాన్ని ఎన్నో రకాలుగా డక్కా ముక్కీలు తినిపించి ఎలాగొలా డ్రైవింగ్ నేర్చుకుంది. చెప్పొద్దూ, ఆ కారు కి సొట్టలేని ప్రదేశం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్లో నుంచి కారు పక్కకి జరపవమ్మ అని అంటే, నాకు జరపటం రావటం లేదు, నువ్వే జరిపి పెట్టు అన్న ఘనత మా గానపెసూనదే. తన ప్రయోగాలన్నిటికి, ఆ కారుని బాగానే వాడుకుని ఇప్పుడేమో కొత్త ఎర్ర కారు ఒకటి కొనుక్కుని మాటిజ్ ని మా నాన్నరి గుమ్మంలో పడేసి నన్ను చూడటనికి అమెరికా వచ్చింది. పడవలాంటి పెద్ద కారు కొనుక్కోకుండా బుల్లి బీమర్ కొనుక్కున్నావేంటి అని ఉన్నన్ని రోజులు నాతొ తగువేసుకుంది. అది కాక, నా కారు నడుపుతానని ఒకటే గోల. ఎక్కడ గుద్దేస్తుందో అని నాకు ఒకటే భయం. ఎలాగైతేనేమి ఒకరోజు నా కారు తిప్పేసింది. నీ బుల్లి బీమర్ ఏ మాత్రం బాగోలేదు, గోతిలో కూర్చున్నట్లుంది అని పెదవి విరిచేసి తాళం నా చేతిలో పెట్టేసింది. హమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాను నేను. ఆ మరుసటి రోజు బీచ్ కి తీసుకెళ్ళాను. అక్కడ ఊరికే ఉంటుందా? పారా సెయిలింగ్ చేస్తానని పారాచూట్ ఎక్కేసి, 'గాల్లో తేలినట్టుందే, గుండే పేలినట్టుందే' అంటు పాట ఎత్తుకుంది. ఆ తరువాత జెట్ స్కీయింగ్ కూడా చేస్తానంటు మొదలెట్టింది. అదేంటో జెట్ మాత్రం నా కన్నా తనే బాగా నడిపించి 'నువ్వు నాతో రా, తమాషాల్లో తేసుల్తా' అంటూ నాగార్జునాలా ఫీల్ అయిపోయింది. మేము దిగిన మోటెల్ వాళ్ళు సైకిళ్ళు అద్దెకిస్తున్నారు. నేను ఒకటి పట్టుకుని బీచ్ రోడ్ అంతా తిరిగేస్తూ వుంటే, నేనేమి తక్కువ కాదంటు తనూ ఒక సైకిలు పట్టుకుని నా వెనకే బయలుదేరి వెంటనే పడి కాలు నొప్పి తెచ్చుకుంది. నాకు నవ్వు ఆగలేదు తనకి రోషం ఆగలేదు.

ఆఫీసుకి పెద్ద పడవలాటి కారు బాగోదని చిన్న ఎర్ర కారు కొనుక్కుని తిరుగుతోంది. నేను ఇండియా వెళ్ళినప్పుడు, ఆ కారులో నన్ను బాగానే తిప్పింది. హైదరాబాదు వాహన ప్రవాహాన్ని, అక్కడి పద్మవ్యూహాలని, అభిమన్యులని చూసి, నాకు కళ్ళు తిరిగిపోయి వెనక సీట్లో కూర్చున్నాను. పక్కవాళ్ళు గుద్దేస్తూ వెళ్తారని, సైడు మిర్రర్స్ మూసేసుకుని నడపటం నాకు భలే అశ్చర్యం కలిగింది. ంత్తానికి నన్ను బానే తిప్పింది కారులో. ఇవాళ ఫోన్ చేసినప్పుడు తన కారు దొంగలెత్తుకెళ్ళినట్లు కలవచ్చింది అని తను చెప్పటంతో, నాకు ఇదంతా రాయాలనిపించింది. పడవంత కారు కొనుక్కుని అది నడపటానికి రోద్ మీద ఖాళీ లేక, పార్కింగ్కి ప్లేస్ దొరకక, ఎన్ని అష్టకష్టాలు పడబోతోందో గానపెసూన అని అలోచిస్తున్నాను.

--విజయ