Thursday, May 19, 2011

మా ఇంటి తోట పని

మా చిన్నప్పుడు మా ఇల్లు ఓ నందన వనంలా ఉండేది. మా అమ్మ ఎంతో ఓపికతో బోలెడు పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పెంచేది. మల్లెలు, మరువాలు, కనకంబరాలు, గులాబీలు, రాధా మనోహరాలు, మాలతి లతలు, లిల్లీలు, నందివర్ధనాలు. ఓహ్!!! ఎంత చెప్పినా తరగని మధురానుభవం. మా ఇంట్లో మందారం ఎందుకుండేది కాదో నాకు ఇప్పటికి అర్థం కాని విషయం. ఈ సంగతులన్నీ చెప్తే, ఇప్పుడు మా పిల్లలు కుళ్ళుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓపికలు మా గానపెసునకి గాని నాకు కాని లేవు. మా అమ్మ ఓపిక, మమ్మల్ని, మా పిల్లల్ని పెంచేసరికి అడుగంటిపోయింది. మా గానపెసున అపార్టమెంట్ బాల్కనీ లో కూడా మా అమ్మే బోలెడు మొక్కలు కుండీల్లో పెట్టింది. మా గానపెసూన వాటికి కాసిన్ని నీళ్ళేసి కాపాడుతోందంటేనే గొప్ప విషయం.

మా ఇల్లు ఓ ఎకరం ఉంటుంది. ఐతే ఏమి లాభం వెనకాల అంతా పెద్ద పెద్ద మేపుల్ చెట్లు. ముందు అంతా పచగడ్డితో లాన్. రెండు పియర్ చెట్లు ఇంకా చాలా క్రోటన్స్ ఉన్నాయి. మొక్కలు పెట్టే తీరికా ఓపిక నాకెప్పుడు చిక్కలేదు. ఐతే గత సవంత్సరం అమ్మా నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు. కొన్నైనా మొక్కలు పెంచాలని యుద్ద ప్రాతిపదికతో కొన్ని మొక్కలు తెచ్చి పెట్టాము. ఎర్ర గులాబి, పచ్చ గులాబి, గార్డెన్ ఫెలిషియ, మందారం ఇవి మా ఇంటి ముందు వెలిసాయి. గులాబి మొగ్గ వచ్చింది అన్న సంతోషం నాకు కాసేపు కూడా నిలువలేదు. తెల్లారె సరికల్లా జింక వచ్చి తినిపోవటం జరిగాయి. అమ్మా నాన్న, మాములుగా మేకలు వచ్చి తిని వెళ్తాయి. మీకెమో జింకలు వచ్చి తినివెళ్తున్నాయి అని నవ్వేవారు. మా ఇంటాయనేమొ పోనిలే వాటికి తిండి దొరికిందిగా అనేవారు. మా చిన్నాడెమో పియర్సు ఎలాగు తింటున్నాయిగా ఇంకా గులాబిలు కూడా ఎందుకు తినాలి అని ఉడుక్కునే వాడు. జింకలు తిని వెళ్తున్నా కూడా మా నాన్న శ్రద్దగా రోజు నీళ్ళు పోసే వారు. మందారం మాత్రం రోజుకో పువ్వు ఇచ్చేది మా వెంకన్న సామి కోసం. ఇవి కాక అమ్మ మెంతికూర, పుదీనా, టొమాటో, పచ్చిమిర్చి మొక్కలు పెట్టింది. ఒక టొమాటో చెట్టు దాదపు 10 కె.జి. వరకు కాసింది. పచ్చిమిర్చి భలే కారం వుండేది. నేను వాటిని ఎన్నోసార్లు బజ్జిలు కూడా వేసాను. పుదీన తో పుదీన రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సార్లు చేసాను. అమ్మా మెంతికూర చట్నీ చేసింది అతి మధురంగా. మా చిన్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే వున్నాడు. అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది, మెంతికూర ఎప్పుడు పూయిస్తుంది. చట్నీ ఎప్పుడు చేస్తుంది అనీ.

అమ్మా నాన్న రానే వచ్చారు. వారికి ఓపికలు తగ్గిపోయాయి. ఇక్కడ వాతావరణం ఇంకా చలిగానె ఉంది వాళ్ళకి. ఈ సారి మొక్కలు కాకుండా, గింజలతో నేనే ముందు మొదలెట్టాను తోట పని. బంతి, మిరప, టొమేటో, బీన్స్ నార పోసాను. అవి సగం మత్రమే మొలకెత్తాయి. నేను రోజు అవి మొలకలు వస్తున్నాయా లేదా అని చూడటం, నా వెనకాలె మా చిన్నిది కూడా వచ్చి చూసి, అవును మొలకొచ్చాయి అన్నట్లుగా బుర్ర ఊపటం (ఇంకా సరిగా మాటలు రావు) భలే ఆనందంగా ఉంటుంది. చిన్నాడు టూలిప్ బల్బ్స్ పాతి పెట్టాడు. చిన్నిది నేను రోజు వెళ్ళి అవి మొలకెత్తాయో లేదో చూస్తూనే ఉన్నాం, అవి పూసేసాయి కూడా. మా చిన్నిదాని ఫేసు కూడా ఒక టూలిప్ బల్బ్ లాగా అనిపించింది నాకు. గత సవత్సరం మొక్కలన్నీ మంచుకు పాడైపోయాయి. ఒక్క ఎర్ర గులాబి మాత్రం తట్టుకుని నిలబడింది. పుదీనా తిరిగి చిగురు తొడిగింది. నారు కాస్త పెరిగాక మొక్కలు నాటాలి. ఇంకొన్ని గులాబీలు, మందారాలు తెచ్చి పెట్టాలి. ఇంక అమ్మ మెంతికూరా ఉండనే ఉంటుంది. ఈ సవత్సరం కూడా ఫెన్స్ వేయటనికి లేదు, జింకలు రావాల్సిందే వాటికి కావల్సినవి తినాల్సిందే అని అందరు తీర్మానించారు. ఐనా మా చిన్నాడు మొక్కలకి నీళ్ళుపోయటనికి ఒప్పేసుకున్నాడు. మా చిన్నిది నాతో పాటు మొక్కల్లో గిర గిర తిరగటానికి చేతిలో చెప్పులు పట్టుకుని మరీ తిరుగుతోంది. ఈ సవత్సరం మా ఇంటి తోట పనికి అందరం సన్నద్దం అవుతున్నాము ఇంకా
--విజయ