Wednesday, July 25, 2012

సరదాగా స్నేహితులతో

అబ్బ ఎంత తేడా? వెన్నెల్లో, ఇసుక తిన్నెల్లో... 'ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి' అంటూ గోదావరి అందాలు మాత్రమె తెలుసు ఇన్ని నాళ్ళు. ఆ అందం ఆస్వాదించటమే తప్ప వర్ణణ చాలా కష్టం. మరి తేడా ఏంటి అంటే, లేక్ ఓజార్క్స్. ఇది మిస్సోరిలో ఉంది. ఇదంతా ఒక స్పీడ్ ప్రపంచం. తీరిగ్గా ఇసుక తిన్నె మీద కూర్చుని 'ఉప్పొంగెలే గోదావరి' అని అస్సలు పాడుకోలేము. ఒక జెట్ స్కీ వేసుకుని స్పీడ్ గా వెళ్తూ 'నువ్వు నాతో రా, తమషాలో తేలుస్తా ' అని పాడుకునే వాళ్ళే ఈ లేక్ కి వెళ్ళాలన్న మాట. భారతం వదిలేసి ఇన్ని నాళ్ళు అయినా ఇంక గోదావరి ఙ్నాపకాలతోనే ఏమి బ్రతికేస్తాములే అని లేక్ ఒజార్క్ లో జెట్ స్కీ వేసుకుని, 'నువ్వు నాతో రా' అంటు నా స్నేహితురాలిని ఎక్కించుకుని మరీ వెళ్ళిపోయాను. యే మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. గోదావరిది ఒకరకమైన అందమైతే, లేక్ ఓజార్క్ ది ఇంకో రకమైన అందం. ఒకటి బాల మురళి పాట ఐతే, ఇంకొకటి మైకేల్ జాక్సన్ పాట. ఐతే రెండింటిని ఇష్టపడగలిగే మనస్తత్వం నాది. అందుకే లేక్ ఒజార్క్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చేసాము.

మేము గుంపుగా అందరం వెళ్ళటం మూలంగా ఇంకా ఎంతో సరదాగ ఉండింది. మొదటి రోజు సాయంకాలం కల్లా అక్కడకి చేరుకున్నాము. ఐతే ఆ రొజు 'అన్ని బేబి ' పుట్టిన రోజు. దొరికిందే చాన్సు అనుకుని, మేము నగలు, చీరలు వేసుకుని 'అందంగా లేనా, అస్సలేమి బాలేనా' అంటూ తెగ హడవిడి చేసాము. అబ్బాయిలేమొ డెకరేషను అంతా గోడలపై సర్దేసారు ఫాస్ట్ ఫార్వార్డ్ లాగా. కాని బేబీ మాత్రం ఓసి పిచ్చి మొహాలు నా పుట్టిన రోజుకి మీ హడవిడి ఏంటి అన్నట్లు మమ్ములందరిని ఒక చూపు చూసి, తనకి, ఆ రోజుకి ఏమి సంబంధం లేనట్లు ఢమాల్ మని నిద్రలోకి జారుకుంది. మేము ఏమి చేయాలో తెలియక కాసేపు బుర్ర గీరేసుకుని, ఎలగొలా కేక్ కట్ చేపించాము (చేసాము). చీర సర్దుకోటానికి పట్టినంత సేపు లేదు ఆ పుట్టిన రోజు వేడుక. కాని ఆ పేరుతో పూర్తిగా భారతీయ వంటకాలన్ని తెగ మెక్కేసాము.

మరుసటి రోజు ఉదయాన్నే కఫీ కప్పులు పట్టుకుని బయట కాలు పెట్టగానె కళ్ళ ఎదురుగానే అతి పెద్ద లేక్. అప్పటికే అందరు నీళ్ళలో బోట్లు, స్కీయింగ్ వేసుకుని మేఘాల్లో తేలిపోతున్నట్లుగా వెళ్ళిపోతున్నారు. మెల్లిగా కాఫిని ఆస్వదించి, బ్రెడ్ ఆంలెట్ ఉపాహారం కానించి బీచ్ వైపు వెళ్ళాము. ఆ బీచ్ లో నీళ్ళు కాస్త మడ్డిగా ఉన్నా అలాగే అందరం చేపల్లా ఈదేసాము. అలా రెండు గంటలు గడిపేసి బయటకి రాగానె. మా మొహాలు ఎండకి రంగు మాసి ఫోటోలో తెల్లటి పళ్ళు తప్పించి ఇంకేమి కనిపించలేదు. జెట్ స్కీయింగ్, బోటింగ్, గో కార్టింగ్, స్విమ్మింగ్ ఇలా రొజుకొకటి చొప్పున అందరం భలే హుషారుగా చేసేసము. పగలంతా ఇలా సరిపోతే సాయాంకాలం అంతా ఆటా పాటలతో గడిపేయటం. ఎలాగైన అందరిని కవులని, రచయితలని, గాయకులని, నటులని చేయాలని విశ్వ ప్రయత్నం చేసాను. సగం ప్రయత్నాలు ఫలించాయి.ఇంకో సగం మళ్ళీ ఇంకెప్పుడైనా ప్రయత్నించాలి. మొదటి ప్రయత్నగా అందరిని కవులని చేసాను. 'వెన్నెల ' మీద చిన్న కవిత రాయమన్నప్పుడు ఒక్కొక్కరి కవితా హౄదయం భలే అందంగా వికసించి రకరకాలైనా కవితలు వినిపించాయి. అవి ఎంతో ఆహ్లదంగా ఆశ్చర్యంగా అనిపించాయి నాకు. అదీ కాక, 5 నిముషాల్లో అందరు రాసేసారు అప్పటికప్పుడు. మరి విశేషమే కదా, కీ బోర్డు పట్టుకుని కోడింగు రాసుకునే వాళ్ళు, నా కోసం కలం పట్టుకుని కవితలు రాయటం. అవి ఇక్కడ అందరి కోసం.