Friday, May 11, 2012

మరవలేని సౌరభాలు


నాకు మొక్కలు పూలు పూయటమే తెలుసు. కాని ఈ దేశంలో చెట్లు పూలు పూస్తాయి. విరగబడి మరీ పూస్తాయి. వెళ్ళే దారంతా పూ దారే. అటు ఇటు పూల చెట్లు చూస్తూ, మంద్రంగా పాట వింటూ, మెల్లిగా కారు నడపటం భలే సరదాగా ఉంటుంది.  అప్పుడప్పుడు గుల్ దస్తా తెచ్చి ఇంట్లో పెట్టుకుని మరీ పూలని తదేకంగా చుస్తూ ఉంటాను. నాలాంటి వాళ్ళు గడ్డి పూలని కూడా విడిచిపెట్టరు. ప్రతి కొమ్మలో పూలని వెదుకుతు, ప్రతి రెకులొ అందాన్ని వెతుకుతూ తిరిగెస్తూ వుంటాను. ఇక్కడి పూల సొబగులు ఎంత చెప్పినా తక్కువే. అదో అద్భుత పూల ప్రపంచం. ఇన్ని వేల పూలు, ఎన్నో రంగుల్లో నా చుట్టూ ఉన్నా,  నాకేమో సన్నజాజులు, మల్లెలు, మరువాలే గుర్తొస్తూ ఉంటాయి.  వాటి సౌరభం  వీటికెక్కడిది అనుకున్నాను. ఒక్కసారిగా మా అమ్మ, ఇంకా తను పెంచిన మల్లెలు, మరువాలు, రాధా మనోహరాలు, మాలతి లతలు గుర్తు వచ్చాయి. మా అమ్మ పట్టు లంగాలు వేసి, జడ కుప్పెలు వేసి, బొలేడు పూలు మా జడల్లో తురుమేది. మేము జింక పిల్లల్లా చెంగు చెంగున తిరుగుతూనే ఉండే వాళ్ళం.  ఈ మధ్య అమ్మ గుర్తు వస్తే వయసు మీరుతున్న అమ్మ, అరోగ్యం దెబ్బ తిన్న అమ్మ, ఇంక తొందర్లొ మమ్ముల్ని విడిచి వెల్లిపొతుందేమొ అన్న బాధ ఎక్కువైపోయి కళ్ళు నీరు కమ్మేస్తున్నాయి.  మా చిన్నిది కూడా ఒక బొండు మల్లెలా ఉంటుంది. అప్పుడప్పుదు పట్టులంగా కూడా వేసుకుంటుంది. కాని, మల్లెలు జడ గంటలు తీరని కోరికే. ఈ నేపద్యంలో నాకు కూడా కంచిపట్టు చీర కట్టుకుని, జడ నిండా మల్లెలు పెట్టుకోవాలనిపించింది. అయ్యో జడ లేదే? మల్లెలు అంతకన్నా లేవు.  పాశ్చాత్య వస్త్ర ధారణకి అలవటు పడిపోయి, కంచిపట్టు చీర కట్టుకుంటే అరువు తెచ్చుకున్నట్లుగా అనిపించింది.   పెద్ద జడ లేదు, జడలో మల్లెలు లేవు ఇంకేమి లాభం? అలంకారం నాకు పెద్దగా అతికినట్లు అనిపించలేదు. ఐనా చీర చుట్టేసుకున్నాను. అప్పటి బాపు బొమ్మలు ఇప్పుడు అసలు వున్నారా అనుకున్నాను. భారతంలో యే మూలో వుండి వుంటరులే. కాని, ఇప్పుడేమో అందరు మోడ్రన్ మహాలక్ష్ములే. యే కాలానికి అదే అందమేమో అనుకున్నాను. మొత్తానికి నేను బాపు బొమ్మలా లేనని మూతి విరిచేసి, అటు ఇటు కాని హ్రుదయంతోని ఎందుకురా ఈ వేదన నీకు అనుకుంటూ మళ్ళీ జీన్స్ తగిలించేసుకున్నాను. 

--విజయ