Tuesday, December 15, 2009

'పా' హిందీ మూవి- ఆస్కార్ కి అర్హత ఉందా?

ఈ సినిమా నేను చూడటానికి కారణం ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను చదవటం ఒక కారణమైతే, ఇంకో కారణం, ఇళయరాజ మ్యూసిక్ కంపోస్ చేయటం. సినిమా బాగుంది కాని, ఆస్కార్ కి అవకాశాలు నాకు అందులో ఏ మాత్రం కనిపించలేదు. ఇళయరాజ బాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నిరిక్షణ లో 'ఆకాశం ఏ నాటిదో, అనురాగం ఆ నాటిది ' ట్యూన్ తో సాగె 'గుం సుం హో క్యోన్ తుం' పాట బాగుంటుంది. అలాగే 'ముడి ముడి మై ఇత్తెఫాక్ సే' మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటుంది.

తెలుగులో 'భారతీయుడు ' చూసాక, ఇంగ్లిష్ లో 'క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ ' చూసాక, అమితాబ్ ప్రోస్తెటిక్ మేకప్ అబ్బురంగా ఏమి అనిపించలేదు. ఇక అమితాబ్ నటన విషయానికి వస్తే, ఎన్నో సవంత్సరాల నటనానుభవం ఉన్న అమితాబ్, 'ఆరో ' పాత్రలో అంతకన్నా తక్కువగాను, అంతకన్నా ఎక్కువగాను నటించటానికి అవకాశమే లేదు. అమితాబ్ కాకుండ ఇంకెవరైన నటించి ఉంటే తప్పకుండా అబ్బురం కలిగేది.

ఇంక ఈ సినిమాలో అద్భుతంగా, అబ్బురంగా అనిపించింది విద్యా బాలన్ పాత్ర. అవకరం ఉన్న బాలుడికి, ఒంటరి తల్లిగా చాలా బాగా నటించి, ఆ నాటి స్మితా పాటిల్ ని, షభాన అజ్మి ని గుర్తు చేసింది. హాలిఉడ్ తో పోటి పడుతూ, ఎంతో కృత్రిమంగా ఉండే హిందీ కథానాయికలను చూసిన కళ్ళకి, విద్యా బాలన్ ఎంతో అహ్లాదంగా, అందంగా, హుందాగా కనిపిస్తుంది. 'గురు ' సినిమాలో ఐశ్వర్య కూడా అలా కనిపించలేదు.

రాజకీయాలు చెడ్డవి కావు, రాజకీయ నాయకుడికి అధికారంతో పాటు, భాద్యత ఉంటుంది, అని నిరూపించే ఎం.పి పాత్రలో అభిషేక్ చాలా బాగా సరిపోతాడు. ఆ నటన కన్నా, ఆ పాత్ర బాగా నచ్చేస్తుంది. సినిమాలో ఆరో లాగే, నేను ఒక 12 ఏళ్ళ పాపనై, అలాంటి ఎం.పిని కలుసుకోగలిగితే బాగుండు అనిపించింది.

విద్య, డాక్టర్ చదువుతూ ఉండి, ప్రెగ్నెన్సి పైనా అవగాహన లేనట్లు ప్రవర్తించిన తీరు, ఇద్దరి కెరీర్ల కోసం యే మాత్రం అలోచించకుండా తను తీసుకునే నిర్ణయం, హీరో పైన అకారణ కోపం అసహజంగా అనిపిస్తాయి. కాని అవకరం ఉన్న పిల్లవాడి ఒంటరి తల్లిగా, ఒక మద్యతరగతి డాక్టర్ గా చాలా సహజంగా అనిపిస్తుంది. ఆరో అమ్మమ్మ కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళగా, కూతురికి, మనవడికి అండగా నిలబడి కృంగి పోకుండా, ఆనందంగా జీవిస్తున్న పాత్రలో ముచ్చటగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడి ఇంటిని, ఒక మధ్య తరగతి డాక్టర్ ఇంటిని చాలా సహజంగా చూపిస్తారు. ఆరో చదువుకునే విద్యాలయం, అందులో విద్యార్థులు బాగుంటారు. ఇలాంటి విద్యాలయాలు ఎన్నో ఉంటే బాగుండు అనిపిస్తుంది.

నాకు నచ్చిన సన్ని వేశాలు. ఆంధ్ర రాష్ట్రం ముక్కలవుతున్న ఈ తరుణంలో, ఆరో రూపొందించిన ఎల్లలే లేని తెల్లటి గ్లోబ్. ప్రపంచమంతా ఒక చిన్న కుగ్రామంగా మారుతుంటే, సమస్యలన్ని వదిలేసి, నీ రాష్ట్రం, నా రాష్ట్రం అని తన్నులాడుకోటం చాలా శొచనీయం. నచ్చిన ఒక డైలాగ్, రాజకీయ నాయకుడు, స్వచ్చతకి ప్రతీకగా తెలుపు ధరిస్తాడు. మనిషి చనిపోయినప్పుడు, శోకానికి ప్రతీకగా కూడా తెలుపు ధరిస్తాడు. ఆరో అంటాడు, దేశం చనిపోతోంది అందుకే రాజకీయ నాయకులు తెలుపు ధరిస్తారు అని. హీరో మీడియాకి చురకలెయ్యటం బహు పసందుగా వుంటుంది.

మొత్తానికి మంచి సినిమా,ఎక్కడా సహజత్వం లోపించదు, కాని ఆస్కార్ కి అవకాశం అంటే అత్యాశే మరి.

--విజయ

No comments: