Thursday, December 10, 2009

నాది నాది అంటావు ఏది నీది?

మనిషి ముందు నేను, తరువాత నా కుటుంబం అనుకుంటాడు. ఎందుకంటే బ్రతుకులోని అనుభూతిని స్వార్దంతో మేళవించి తనది అనుకునే ప్రతిదాన్ని నిర్మించుకోవాలని తపనపడ్తూ జీవితం సాగిస్తాడు. ఆ క్రమంలో, నా ప్రాంతం , నా దేశం, నా ఇల్లు, నాది నాది అంటూ, విశ్వంలో ప్రతి పదార్థాన్ని సొంతం చేసుకోవాలని తాపత్రయపడ్తూ బ్రతుకుతుంటాడు. అంత వరకు మానవనైజం అని సరిపెట్టుకుంటే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగివుండేవి కావు. నా జిల్లా, నాకంటే నువ్వెక్కువ ఉన్నావు అంటూ, ఒకరినొకరు చంపుకుంటూ బ్రతికేది ఎవరైనా, సంపూర్ణ ఆయుశ్శు ఉంటే 80 ఏళ్ళు.

ఒక మొక్కని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, దానికి ప్రాణం ఉంది కదా అక్కడే ఉంటుంది. పుట్టినప్పటినుండి ఎన్నో ఫలాలనిస్తుంది ఇతరులకే, తను తినదు. ఎన్నో పక్షులకి ఆశ్రయమిస్తుంది, ఏమి ఆశించదు. బ్రతికినంత కాలం, ప్రాణవాయువుని ఇస్తుంది. నాది అని ఏమైనా అడుగుతుందా? ఒకోటి దాదాపు 300 ఏళ్ళు బ్రతుకుతుంది. మనకి తోడుండటానికి, సూర్యుడు ఏమి ఆశించకుండ వెలుగు ఇస్తున్నాడు, గాలి నిన్ను డబ్బులేమి అడగకుండ ప్రాణవాయువుని ఇస్తుంది. మనిషి ఏమిస్తున్నాడు? బ్రతికిన కొన్ని రోజులకి గాను స్వార్ధంతో పర్యావరణానికి చేటు చేస్తూ, రాబోయే తరాల వారికి కాలుష్యాన్ని నింపుతూ, నాది నాది అని కొట్టుకు చస్తూ, కొన్ని రోజులకి భూమి అనే పదార్ధమే సృష్టిలో నుండి కనుమరుగయ్యేలా, మానవజాతి మొత్తం అంతరించిపోయేలా, చాలా జాగర్తలు తీసుకుంటున్నాడు. అసలు సమస్యలన్ని పక్కనపెట్టి లేని సమస్యలని సృష్టించుకుంటూ, కాలాన్ని అద్బుతంగ్అ వెళ్ళదీస్తున్నాడు. ఆలోచించిన వాళ్ళు, నాది నాది అంటూ మన ఇంటిని మనమే తగలబెట్టుకుంటున్నాం అని వారికి అర్దం అయ్యేలా చెప్పగలిగితే బాగుండును.

--భారతి

No comments: